'నాన్నా... నీ స్నేహితుడే నన్ను వేధిస్తున్నాడు...' అంటూ లేఖ రాసి, ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
- వరంగల్ జిల్లా కాశిబుగ్గలో ఘటన
- కాలేజీకి వెళ్లి వస్తుంటే వేధించిన తండ్రి స్నేహితుడు సంతోష్
- లేఖ రాసిపెట్టి ఉరేసుకున్న భవాని
కేసు నమోదు చేసిన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గూడూరు భవాని అనే అమ్మాయి, వరంగల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి గూడూరు రవికి వడ్డేపల్లి సంతోష్ అనే స్నేహితుడు ఉన్నాడు. నిత్యమూ కాలేజీకి వెళ్లి వచ్చే వేళ, సంతోష్ అటకాయించి, ఆమెను వేధిస్తుండేవాడు. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని అంటుండేవాడు.
ఇదే సమయంలో పక్కింట్లోనే ఉన్న పోరండ్ల భిక్షపతి అనే యువకుడు కూడా ఆమె వెంటపడ్డాడు. వీరి వేధింపులు భరించలేని అమ్మాయి, బాత్ రూములో తన చున్నీతోనే ఉరేసుకుని మరణించింది. "నాన్నా... నీ స్నేహితుడే నన్ను టార్చర్ చేస్తున్నాడు. నీకు చెప్పలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని లేఖ రాసింది. రవి ఫిర్యాదుతో సంతోష్, భిక్షపతిలపై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.