డిసెంబర్ లో ఎన్నికలు జరిగినంత మాత్రాన.. కేసీఆర్ గెలుస్తారా?: అమిత్ షా ఎద్దేవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ లో ఎన్నికలు జరిగినంత మాత్రాన.. కేసీఆర్ గెలుస్తారా?: అమిత్ షా ఎద్దేవా

  • ఒవైసీకి భయపడి రాష్ట్ర విమోచన దినాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదు
  • కేసీఆర్ పై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారు
  • కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని... అందుకే, తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించడం లేదని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని దేశం గర్వించేలా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. లోక్ సభతో పాటే అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే... ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని అన్నారు. మే నెలలో గెలవలేని కేసీఆర్... డిసెంబర్ నెలలో ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ బహిరంగసభలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అమిత్ షా మండిపడ్డారు. 2014లో దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికైనా ఆ పని చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులంతా కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో దళితులకు, ఆదివాసీలకు భరోసా ఇవ్వగలిగిన పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలలు కంటున్నారని... వరుసగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో ఆయన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అమిత్ షా అన్నారు. పీవీ నరసింహారావు, అంజయ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
amit shah
kcr
owaisi
congress
Rahul Gandhi

More Telugu News