kasthuri: ఐటమ్ సాంగ్ గురించి ప్రశ్నించిన అభిమాని .. ఘాటుగా స్పందించిన సీనియర్ హీరోయిన్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై గ్లామర్ తో వెలుగొందిన నిన్నటితరం కథానాయికలలో కస్తూరి ఒకరు. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో 'సోగ్గాడి పెళ్లాం' .. 'మా ఆయన బంగారం' మంచి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కుర్రకారు మనసులు దోచేసిన కస్తూరి, ఆ తరువాత నటనకు దూరమయ్యారు. 2010లో 'తమిళ పదం' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత నుంచి తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా ఆమె 'తమిళపదం'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'తమిళపదం 2.0' సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్లో ఐటమ్ సాంగ్ బిట్ లో ఆమె మెరిశారు. దాంతో ఆమె గ్లామర్ కాపాడుకుంటూ వస్తోన్న తీరు పట్ల చాలామంది అభినందనలు తెలియజేస్తే, ఒక అభిమాని మాత్రం .. 'బాధ్యత కలిగిన తల్లిగా ఉండాల్సిన ఓ స్త్రీ ఇలా ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్?' అంటూ ప్రశ్నించాడు.

అందుకు కస్తూరి కాస్త ఘాటుగానే స్పందిస్తూ .. 'పెళ్లైన మగవాళ్లు మద్యం సేవించే సన్నివేశాలు .. ఐటమ్ సాంగులు చేస్తున్నారు కదా? మరి వాళ్లకి పిల్లల పట్ల బాధ్యత ఉండాల్సిన పనిలేదా? ఈ విషయంలో వాళ్లను ఎందుకు ప్రశ్నించరు? అమ్మనైనంత మాత్రాన ఐటమ్ సాంగ్ చేయకూడదనే నియమం లేదు కదా? స్త్రీ పురుష సమానత్వం ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. ఇలాంటి ప్రశ్నలతో దానిని పాతాళానికి తొక్కేయకండి' అంటూ సమాధానమిచ్చారు.       
Go Back to Shorts
kasthuri

More Telugu News