పవన్ ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్టు ఆధారాలు లభ్యం.. కేసులు నమోదు
- శ్రీరెడ్డి వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారంటూ వీడియో పోస్టు చేసిన పవన్
- తాము ‘బీప్’ చేశామన్న ఏబీఎన్
- వీడియో మార్ఫింగ్ అయినట్టు గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి ఓ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్‌లో పదేపదే చూపించారన్నది పవన్ ఆరోపణ. పవన్ ఆరోపణలను ఖండించిన ఏబీఎన్.. శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము యథాతథంగా ప్రచారం చేయలేదని, ఆమె దూషణను ఎడిట్ చేసి, ఆ వ్యాఖ్య వచ్చినప్పుడు బీప్ శబ్దం ఇచ్చి పలు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.
ఏబీఎన్ ఎడిట్ చేసిన వీడియోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పవన్ పోస్టు చేశారని, చానల్ ఎండీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏబీఎన్ ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు రెండు రోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పవన్ ట్వీట్ చేసిన వీడియోను మార్పింగ్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.