రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు... హైకోర్టులో కేటీఆర్‌కు భారీ ఊరట

  • రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ కేటీఆర్ ఆరోపణ
  • కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కేసు నమోదు
  • ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉట్నూరు పోలీసులు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఉట్నూరులో జరిగిన ఒక సభలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల నిధుల కోసం మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది.


More Telugu News