Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన
- అద్భుతంగా జరిగిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం
- మూడు రోజు పాటు జరిగిన వేడుకలు
- సంతోషాన్ని వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురంలో మూడు రోజుల పాటు జరిగిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అద్భుతంగా సాగిందని, ఈ కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వేడుకలకు పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
"మొదటి రోజు సాంప్రదాయ కళలతో సందడి చేశారు. సత్యసాయి జిల్లా ఉరుముల కళారూపంతో ఎస్. వరప్రసాద్, కర్నూలు నుంచి గురవయ్యల కళాకారుడు జె. మల్లికార్జున, లంబాడీ నృత్యంతో జి. సునీత, కృష్ణా జిల్లా డప్పు కళాకారుడు వి. రాజీవ్ బాబు, శ్రీకాకుళం తప్పెటగుళ్ల కళాకారుడు కె. మల్లేశ్వర రావు, విజయనగరం పులి వేషధారి కె. అప్పారావు, అల్లూరి సీతారామరాజు థింసా నృత్య కళాకారుడు పొద్దు అర్జున్, కోలాటం అంజలి, కోనసీమ గరగల కళాకారుడు రాజ్‌కుమార్, హరిదాసులు-గంగిరెద్దు కళాకారుడు సతీశ్... ఇలా ప్రతి కళాకారుడూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
రెండవ రోజు ప్రార్థనా గీతాలతో శుభారంభం అయింది. విజయ శంకర్ నాయకత్వంలోని ప్రభుత్వ సంగీత-నృత్య పాఠశాల బృందం, కూచిపూడి రామాయణం వీ.ఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వం చాటారు. యోగా డ్యాన్స్‌తో శ్యామ్ బాబు బృందం ఆరోగ్యం-ఆధ్యాత్మికత సమన్వయాన్ని చూపించారు.
మూడవ రోజు... వినాయక తత్వంతో మంజీర కూచిపూడి బృందం, నటరాజ నృత్యం పి. సత్యనారాయణ, రేలారే రేలా జానకీరావు ఆర్కెస్ట్రా... ఇలా ప్రతి రోజూ సాంస్కృతిక వైభవం ప్రదర్శనతో సంబరాలు జోరుగా సాగాయి.
పట్టణ వీధుల్లో, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి మండలాల్లో తిరిగే కళారూపాలు, స్టాళ్లలో తోలుబొమ్మలు, మగ్గాలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, బొబ్బిలి వీణల తయారీ... ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు. వీణలను స్టాల్ వద్దే తయారు చేసిన తీరు ఆకట్టుకుంది.
పండగ సంబరాల కోసం వచ్చిన సినిమా నటులు హైపర్ ఆది, ఆర్.కె. సాగర్, నవీన్ పొలిశెట్టి, దర్శకుడు హరీశ్ శంకర్, జబర్దస్త్ నటులు నెల్లూరు నాగరాజు, శ్రీనివాసులు నాయుడు, అభిరాం తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు" అని పవన్ పేర్కొన్నారు.