Revanth Reddy: ఇది చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్: హరీశ్ రావు

Revanth Reddys Sankranti Gift to Chandrababu says Harish Rao
  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • తెలంగాణ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి ఏపీకి సహకరిస్తున్నారని హరీశ్ విమర్శ
  • రిట్ ఉపసంహరణ ఏపీకి ప్రాజెక్టు కట్టుకునేందుకు సమయం ఇవ్వడమేనని వ్యాఖ్య
  • గురుదక్షిణ కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆక్షేపణ
  • రేవంత్ రెడ్డి తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన రాజకీయ గురువు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని, రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన ఆరోపించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసేలా ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్ సర్కారు కావాలనే విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి చేతులు దులుపుకొందని విమర్శించారు. 

"గతంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం రైతుల చేత రిట్ పిటిషన్లు వేయించి మరీ స్టే తెచ్చుకుంది. కానీ ఇక్కడి చేతకాని కాంగ్రెస్ సర్కారు మాత్రం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది. ఈ మాత్రం విషయం ప్రభుత్వ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా? కేవలం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకుని ఢిల్లీ వెళ్లారా?" అని హరీశ్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేయడం చారిత్రక ద్రోహమని మండిపడ్డారు.

రిట్ పిటిషన్ ఉపసంహరించుకుని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం ఏపీకి ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకోవడానికి గడువు ఇవ్వడమేనని హరీశ్ రావు ఆరోపించారు. సివిల్ సూట్‌లో ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉంటుందని, ఇది ఏళ్లు గడిచినా తేలని వ్యవహారమని అన్నారు. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసుకుని తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం-నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచీ ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోందని హరీశ్ ఆరోపించారు. "ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. సంతకం పెట్టనంటూనే పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారు. కమిటీ వేయనంటూనే వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేశారు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ముగిశాక కోర్టుకు వెళ్లి పరోక్షంగా ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు," అని విమర్శించారు.

కేవలం తన గురుదక్షిణ కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు ఆక్షేపించారు. "పంచాయతీలు, న్యాయస్థానాలు వద్దని, కూర్చొని మాట్లాడుకుందాం అనడంలో అంతర్యం ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పగించడమే ఆ చర్చల లక్ష్యమా?" అని నిలదీశారు. 

"తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డీ... నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. రేవంత్ రెడ్డీ... నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం" అని హరీశ్ రావు స్పష్టం చేశారు.


Revanth Reddy
Telangana
Chandrababu Naidu
Polavaram project
Nallamalla Sagar
Harish Rao
AP government
water rights
Supreme Court
irrigation projects

More Telugu News