Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ

Mamata Banerjee Writes to EC Again Over Voter List Revision
  • 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపణ
  • నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న మమతా బెనర్జీ
  • ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీకి ఇది ఐదో లేఖ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. దీనివల్ల నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఆమె లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఈసీకీ లేఖ రాయడం ఇది ఐదోసారి.

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టారని, అయితే ఈ ప్రక్రియ సందర్భంగా ఓటర్ల వివరాల్లో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది పెద్ద ఎత్తున డేటా మిస్ మ్యాచ్‌కు దారి తీసిందని, దీనివల్ల నిజమైన ఓటర్లు ఈ సమస్య బారిన పడుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత రెండు దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఈసీ ఇప్పుడు పక్కన పెట్టిందని ఆమె ఆరోపించారు.

దీనితో ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ఎప్పటినుంచో వస్తున్న తన సొంత పద్ధతులను విస్మరించడాన్ని ఆమె ఖండించారు. ఇది ఏకపక్షంగా, అహేతుకంంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఎస్ఐఆర్ సమయంలో సమర్పించిన పత్రాలకు సరైన రసీదు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ ప్రక్రియలోనే లోపం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా వరకు యాంత్రికంగా, సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతోందని, సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.
Mamata Banerjee
West Bengal
Election Commission
Voter list
Special Summary Revision
SIR

More Telugu News