Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే!

Kavya Maran buys England League team names it Sunrisers Leeds
  • ఇంగ్లండ్ ది హండ్రెడ్ టోర్నీలో లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు
  • నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఇకపై 'సన్‌రైజర్స్ లీడ్స్'
  • ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ డీల్
  • ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లిన తొలి ది హండ్రెడ్ టీమ్‌గా రికార్డ్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సుపరిచితమైన సన్ గ్రూప్, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇంగ్లండ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో లీడ్స్ నగర ఆధారిత ఫ్రాంచైజీని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పేరుతో ఉన్న ఈ టీమ్‌ను 'సన్‌రైజర్స్ లీడ్స్'గా రీబ్రాండ్ చేసింది.

ఈ డీల్ విలువ సుమారు 100 మిలియన్ యూరోలు అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB), యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఆధీనంలో ఉన్న ఈ ఫ్రాంచైజీని సన్ గ్రూప్ పూర్తిగా సొంతం చేసుకుంది. 'ది హండ్రెడ్' చరిత్రలో ఒక ఫ్రాంచైజీ పూర్తి ప్రైవేట్ యాజమాన్యానికి వెళ్లడం ఇదే తొలిసారి.

ఈ మార్పుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని కావ్య మారన్ స్పందిస్తూ, "సన్‌రైజర్స్ అనేది కేవలం ఒక టీమ్ కాదు.. అదొక కుటుంబం, భావోద్వేగం, అభిరుచి. ఇప్పుడు హెడింగ్లీ స్టేడియాన్ని ఆరెంజ్ రంగుతో నింపడానికి సిద్ధంగా ఉన్నాం. నిర్భయంగా, ఉత్సాహంగా ఆడతాం" అని పేర్కొన్నారు. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌లతో పాటు ఇప్పుడు ఈ టీమ్‌ను కూడా తమ గ్లోబల్ బ్రాండ్‌లో భాగం చేశారు.

ఈ మార్పు 2026 సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే సీజన్ నుంచి ది హండ్రెడ్‌లో ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ పద్ధతికి బదులుగా వేలం ద్వారా జరగనుంది. అంతేకాకుండా, ఆటగాళ్ల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఇదిలా ఉండగా, మరో రెండు జట్లు కూడా పేర్లు మార్చుకోనున్నాయి. మాంచెస్టర్ ఒరిజినల్స్ 'మాంచెస్టర్ సూపర్ జెయింట్స్'గా, ఓవల్ ఇన్విన్సిబుల్స్ 'ఎంఐ లండన్'గా మారనున్నాయి. ఈ పరిణామాలు 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీల పెట్టుబడులు, గ్లోబల్ విస్తరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Kavya Maran
Sunrisers Hyderabad
The Hundred
Sun Group
England Cricket
Northern Superchargers
Sunrisers Leeds
Cricket Franchise
Yorkshire County Cricket Club
IPL

More Telugu News