Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says He Couldnt Take a Single Day Off
  • ఇప్పటి వరకు తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి
  • ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరన్న రేవంత్ రెడ్డి
  • ఉద్యోగులే ప్రభుత్వ సారథులు.. వారధులన్న ముఖ్యమంత్రి
తాను ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, సెలవు తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఏదో ఒక పని వచ్చిపడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని, 10.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు.

ఉద్యోగులే ప్రభుత్వ సారథులని, వారధులని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల్లో కూడా తనను ఇష్టపడని వారు ఉండొచ్చని, తాను వచ్చిన తరువాత ఉద్యోగుల వేతనాలు ఎలా అందుతున్నాయో గమనించాలని అన్నారు. ఉద్యోగుల డీఏ ఫైళ్లపై సంతకం చేసి ఇక్కడికి వచ్చానని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.1 కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.12 వేల కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే రావాల్సిన నిధులు వస్తాయని అన్నారు. పన్నులు పెంచాల్సిన అవసరం లేదని, సరిగా వసూలు చేస్తే చాలని వ్యాఖ్యానించారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలో జిల్లాల పునర్విభజన కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Revanth Reddy
Telangana CM
Telangana government employees
Government employees welfare

More Telugu News