నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలపై టీజీ రెరా కొరడా

Realty
Advertisement
  • అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ప్రచారం చేసిన సనాలి ఐటీ పార్క్స్‌కు రూ. 25 లక్షల జరిమానా
  • కొనుగోలుదారులకు 10.85 శాతం వార్షిక వడ్డీతో సొమ్ము తిరిగి చెల్లించాలని డెవలపర్లకు ఆదేశాలు
  • నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చేసిన భువన్‌తేజా ఇన్‌ఫ్రాను డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ పనుల రద్దు
  • ఆదేశాలు అమలు చేయకపోతే రెరా చట్టం సెక్షన్ 63 కింద మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరిక
నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను మోసగిస్తున్న పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కఠిన చర్యలు చేపట్టింది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టులను మార్కెటింగ్ చేయడం, ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం, చట్టబద్ధమైన అనుమతులు పొందకపోవడం, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలపై అథారిటీ కొరడా ఝళిపించింది. ఈ మేరకు నవంబర్ 17న వెలువరించిన ఉత్తర్వుల ద్వారా పలు సంస్థలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, బాధితులకు వడ్డీతో సహా నగదు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో చేపట్టిన ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రచారం, విక్రయాలు చేపట్టినందుకు గాను సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు అథారిటీ రూ. 25 లక్షల భారీ జరిమానా విధించింది. మేనేజింగ్ పార్టనర్ నూర్ హక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ రెరా చట్టం సెక్షన్ 3(1)ని ఉల్లంఘించినట్లు తేల్చింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని, ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ వచ్చేంతవరకు ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలు తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే, భూముల రిజిస్ట్రేషన్ రద్దు తమ పరిధిలోకి రాదని స్పష్టం చేస్తూ, పరిహారం కోసం బాధితులు సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపింది.

సంగారెడ్డి జిల్లా వెలిమలలోని ‘ఆరా’ ప్రాజెక్టులో ఇద్దరు కొనుగోలుదారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి, నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయని భువన్‌తేజ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టీజీ రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. 1,700 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం చెల్లించిన రూ. 26 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో కలిపి 45 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే సదరు డెవలపర్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ ప్రాజెక్ట్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, భవిష్యత్ ప్రాజెక్టులలోనూ బుకింగ్‌లు చేపట్టరాదని స్పష్టం చేసింది.

తెల్లాపూర్‌లోని ‘త్రిపుర నిర్వాణ’ ప్రాజెక్టులో అనుమతులు లేకుండానే రూ. 41.85 లక్షలు వసూలు చేసిన త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు కూడా రెరా షాక్ ఇచ్చింది. ఆ మొత్తాన్ని 10.85 శాతం వడ్డీతో వాపస్ ఇవ్వాలని నిర్దేశించింది. నవంబర్ 20, 2026 నాటికి రూ. 10 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఫిబ్రవరి 2027 నాటికి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలని, వడ్డీ బకాయిలను 60 రోజుల్లో తీర్చాలని ఆదేశించింది. శంకర్‌పల్లిలోని ‘జాస్విత ఎస్టేట్స్’లో ప్లాట్ కోసం రూ. 47 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన కేసులో శాండ్‌స్టోన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 10.85 శాతం వడ్డీతో పూర్తి నగదును 60 రోజుల్లో తిరిగి ఇవ్వాలని పేర్కొంది.

హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులు తీసుకోకుండా ‘టెక్ హోమ్స్’ పేరిట విల్లా కోసం అడ్వాన్స్ తీసుకున్న ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థ రూ. 27,16,430 మొత్తాన్ని 10.85 శాతం వడ్డీతో 60 రోజుల్లోగా తిరిగి ఇవ్వాలని అథారిటీ ఆదేశించింది. పటాన్‌చెరు పరిధిలోని ఘన్‌పూర్‌లో ‘ఆర్నేట్-1’ ప్రాజెక్టులో జాప్యం కారణంగా బుకింగ్ రద్దు చేసుకున్న కొనుగోలుదారుడికి రూ. 17 లక్షలను శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ పూర్తి వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ, సంస్థ ప్రతిపాదించిన 15 శాతం తగ్గింపు వాదనను తిరస్కరించింది.

మహేశ్వరం మండలం సిరిగిరిపురంలోని ‘ఎస్‌వీ ఎలక్ట్రానిక్ సిటీ-3’ ప్రాజెక్టులో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయని బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7 లక్షలను 10.85 శాతం వడ్డీతో మహిళా బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది. అలాగే హఫీజ్‌పేటలోని ‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్టులో ఫ్లాట్ అప్పగింత ఆలస్యమైనందుకు గాను వాసవి రియల్టర్స్ ఎల్ఎల్‌పీ సంస్థ కొనుగోలుదారుడికి రూ. 49.50 లక్షలపై 10.85 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని పేర్కొంది. మియాపూర్‌లోని ‘అరినే ఎమరాల్డ్’ ప్రాజెక్టులో సేల్ డీడ్ పూర్తయినా ఫ్లాట్ అప్పగించని అరినే ఇన్‌ఫ్రా సంస్థ తక్షణమే ఫ్లాట్ నం. 502ను స్వాధీనం చేయాలని, జాప్యానికి గాను వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.

రియల్ ఎస్టేట్ చట్టం 2016, నిబంధనలు 2017 ప్రకారం జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే, డెవలపర్లపై సెక్షన్ 63 ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ రెరా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

TG RERATelangana Real Estate Regulatory AuthorityHyderabad Real Estate ViolationsRERA Telangana Orders

More Telugu News

15 ఏళ్ల ఎదురుచూపు ఫలించింది: ట్రక్కు డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ

18 Nov, 09:11

ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.15 వేలు!

18 Nov, 08:53

జంటపై గంజాయి కేసు పెట్టాలని పోలీసుల ప్లాన్.. వీడియో వైరల్

18 Nov, 08:45

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

18 Nov, 08:41

ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్.. భావోద్వేగంతో స్పందించిన భార్య సాక్షి

18 Nov, 08:13

బట్టతలకు చెక్... జుట్టును మొలిపించే ఎలక్ట్రిక్ దువ్వెనను సృష్టించిన చైనా సైంటిస్టులు!

18 Nov, 08:12

కుల్గాంలో ఎన్‌కౌంటర్: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు

18 Nov, 07:58

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. తీవ్ర తుపానుగా మారే అవకాశం

18 Nov, 07:56

'రామాయణ' 13 రోజుల వసూళ్లు రూ.1,483 కోట్లు.. ఐఎండీబీలో 'ది ఒడిస్సీ'ని దాటేసింది

18 Nov, 07:36

పదేళ్ల వయసులో స్కూబా డైవర్‌గా రికార్డు.. ఇరా ఆదిత్య రౌత్ ఆరు రికార్డులు

18 Nov, 07:33

దేశ కాలుష్యంలో 40 శాతానికి నేనే బాధ్యుడిని: గడ్కరీ

18 Nov, 07:24

26 ఏళ్ల తర్వాత తట్టు నిర్మూలన హోదా కోల్పోయిన అమెరికా.. కారణం ఇదే!

18 Nov, 07:22

టెక్ దిగ్గజాలకు వరుస కష్టాలు.. యాపిల్‌లోనూ గంటల పాటు సేవలు బంద్

18 Nov, 07:10

బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. విజయవాడకు 13 కి.మీ. దూరంలోనే అమరావతి స్టేషన్!

18 Nov, 06:51
..More Telugu News