Advertisement

‘‘నేను ప్రధాని కావడం రాహుల్‌, ప్రియాంకలకు ఇష్టం లేదు’’.. సోనియా ఆసక్తికర విషయాలు

National
Advertisement
  • 2004లో ప్రధాని పదవిని తిరస్కరించిన సోనియా
  • ఎంపీల ఒత్తిడితో ఓ దశలో ప్రధాని పదవి చేపట్టేందుకు ఓకే చెప్పినట్లు వెల్లడి
  • తన నిర్ణయంపై రాహుల్‌, ప్రియాంక తీవ్ర ఆందోళన చెందినట్లు వ్యాఖ్య
  • ఇందిర, రాజీవ్ హత్యలే వారి ఆందోళనకు కారణమని వెల్లడి
  • తన విదేశీ మూలాలను వాడుకొని బీజేపీ దేశంలో ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని భావించినట్లు చెప్పిన సోనియా
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నిరాకరించడం వెనుక ఎన్నో భావోద్వేగ సంఘర్షణలు ఉన్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. పార్టీ పట్ల తనకున్న బాధ్యత, వ్యక్తిగత భయాలు, దివంగత భర్త రాజీవ్ గాంధీ మార్గదర్శకత్వం లేకపోవడం.. ఇవన్నీ తనను అంతర్మథనానికి గురిచేశాయని తెలిపారు. తన తాజా పుస్తకం ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో ఈ విషయాలను వివరించారు.

ఎన్నికలకు కొన్ని నెలల ముందే తాను ప్రధానమంత్రి అయ్యే అవకాశంపై కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో చర్చించినట్లు సోనియా చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే ప్రధాని పదవిని స్వీకరిస్తారా? అని వారిలో ఒకరు నేరుగా అడిగారని, తాను మాత్రం కచ్చితంగా అంగీకరించబోనని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. రాహుల్‌, ప్రియాంక ఇద్దరూ తాను ప్రధాని కావడాన్ని ఇష్టపడలేదని తెలిపారు. చిన్నతనంలోనే నానమ్మ ఇందిరా గాంధీ హత్యను, తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్యను చూసిన వారికి ప్రధాని పదవి అంటే మరింత ప్రమాదంతో కూడుకున్నదనే భావన ఉండేదని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచార సమయంలోనూ ప్రధాని పదవిపై ప్రశ్నలు ఎదురైనప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు సోనియా తెలిపారు. పార్టీ ఐక్యతే తన ముందున్న ప్రధాన లక్ష్యమని, నాయకత్వం కోసం పార్టీలో పోటీ ఏర్పడకూడదని భావించినట్లు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం, నిష్కళంకమైన నిజాయతీ ఉన్న వ్యక్తి అవసరమని అప్పుడే అనుకున్నట్లు వెల్లడించారు.

యూపీఏ విజయం తర్వాత పరిస్థితి మారిందని సోనియా గుర్తుచేసుకున్నారు. ఒకవైపు ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయం బలంగా ఉన్నా, మరోవైపు పార్టీ కార్యకర్తలు, ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేయాలనే బాధ్యత వెంటాడిందన్నారు. తన మనసు క్షణక్షణానికి మారేదని, ఒకసారి స్పష్టత ఉంటే మరోసారి తీవ్ర సందిగ్ధంలో పడేదానినని వివరించారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పదవిని స్వీకరించాలని పదేపదే కోరారని తెలిపారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఒక సందర్భంలో ‘సరే’ అని అన్నానని వెల్లడించారు. అయితే తన మాట పూర్తికాకముందే వారు దాన్ని అంగీకారంగా భావించి అభినందనలు మొదలుపెట్టారని చెప్పారు. ఈ విషయం తెలిసి రాహుల్‌, ప్రియాంక తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తనను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న భావనతో వారు తన దగ్గరకు వచ్చారని పుస్తకంలో రాశారు.

చివరకు ప్రధాని పదవిని చేపట్టకూడదనే నిర్ణయానికి రావడానికి దేశ భవిష్యత్తు గురించిన ఆలోచనలే ప్రధాన కారణమని సోనియా తెలిపారు. తన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుతో పాటు దేశ గమనంపైనా ప్రభావం చూపుతుందని భావించినట్లు చెప్పారు. విభజన రాజకీయాలకు దూరంగా, అభివృద్ధి, ప్రగతికి ప్రాధాన్యమిచ్చే బలమైన, సమర్థమైన ప్రభుత్వం దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. తన విదేశీ మూలాలను రాజకీయంగా ఉపయోగించుకుని బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలో ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని భావించినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని పదవిని చేపట్టాలని కోరినప్పటికీ, తన అంతరాత్మ చెప్పిన నిర్ణయాన్నే పాటించానని సోనియా స్పష్టం చేశారు. అధికారంపై తనకు ఎప్పుడూ ఆసక్తి లేదని, దేశ లౌకిక పునాదులను, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన లక్ష్యమని చెప్పారు. తన నిర్ణయాన్ని మార్చుకోబోనని ఎంపీలకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

అనంతరం ప్రధానిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఎంపీల అనుమతి కోరిన సోనియా.. డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించారు. ఆయన పేరును వెల్లడించగానే సభలో చప్పట్లు మార్మోగాయని, పలువురు ఎంపీలు లేచి నినాదాలు చేశారని గుర్తుచేసుకున్నారు. రాహుల్‌, ప్రియాంక కూడా లేచి నిలబడి తన నిర్ణయాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారని తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Sonia GandhiRahul GandhiPriyanka Gandhi VadraBelonging A Journey of LoveUPA Government 2004Manmohan Singh

More Telugu News

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

10 Nov, 11:22

క్వాంటాస్‌లో ఏఐ కలకలం.. 850 మందికి ఉద్వాసన.. భారత్‌కు ఉద్యోగాల తరలింపు

10 Nov, 11:14

పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్

10 Nov, 11:12

‘‘నన్ను చూస్తే చూపు తిప్పుకుంటారు’’.. తన పుస్తకంలో మోదీపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు!

10 Nov, 11:01

మూడేళ్ల బాలుడి పునర్జన్మ కథ.. సైన్స్‌కు అందని రహస్యం.. పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన!

10 Nov, 10:58

ఫామ్‌లోకి వచ్చిన జైస్వాల్, పడిక్కల్.. డ్రాగా ముగిసిన భారత్-ఏ సిరీస్

10 Nov, 10:46

ధైర్యంగా కోలుకుంటోంది.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్

10 Nov, 10:44

పాక్ క్రికెట్‌లో సంచలనం.. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు!

10 Nov, 10:40

పవన్ కల్యాణ్‌తో విడాకులకు సంబంధించి ముందే హింట్ ఇచ్చిన అన్నా కొణిదెల?

10 Nov, 10:38

టీబీ చికిత్సలో కొత్త ఆశలు.. హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తల కీలక ముందడుగు!

10 Nov, 10:34

మమత కాళీ పూజ వెలవెల.. తగ్గిన రాజకీయ వైభవం!

10 Nov, 10:14

నిద్రలేచాక ఎన్ని గంటల్లో టిఫిన్‌ చేయాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే!

10 Nov, 10:12

ప్రకాశం జిల్లాలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

10 Nov, 10:10

హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి

10 Nov, 10:08
..More Telugu News