సరస్ మేళా.. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామికవేత్త రావాలి: సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరస్ మేళా.. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామికవేత్త రావాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says every household should produce a woman entrepreneur
  • విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి, సీఎం
  • మహిళాశక్తికి రాష్ట్రపతి ముర్ము స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు
  • గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ గుర్తింపు తేవడమే మేళా ఉద్దేశం
  • డ్వాక్రా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
  • త్వరలో డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు కావాల‌న్న సీఎం 
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో 'జాతీయ సరస్ మేళా' వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఈ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళల నైపుణ్యానికి, వారి ఉత్పత్తులకు వేదికగా నిలిచే ఈ కార్యక్రమానికి కనకదుర్గమ్మ సన్నిధి, కృష్ణమ్మ తీరం వేదిక కావడం విశేషం.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడలో ఈ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ తర్వాత తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ము జీవితం మహిళలందరికీ ఆదర్శమని కొనియాడారు. మహిళలు సంకల్పిస్తే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని ముర్ము నిరూపించారని ప్రశంసించారు.

మహిళా శక్తిని చాటేందుకే విజయవాడలో ఈ మేళాను ఏర్పాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 650 స్టాళ్లు మహిళల నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, కొత్త వ్యాపార అవకాశాలు సృష్టించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ ఉత్పత్తులు జాతీయ ఉత్పత్తులుగా మారాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రారంభించిన డ్వాక్రా ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు రూ.69 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటూ, లక్ష కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్నాయని, త్వరలోనే ఇది రూ.10 లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. 

త్వరలోనే పది లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆరు కోట్ల మందిని వ్యాపారవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఆయన స్ఫూర్తి ప్రశంసనీయమని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే తమ ఆశయమని సీఎం స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Droupadi Murmu
National Saras Mela Vijayawada
Women Entrepreneurs Andhra Pradesh
DWCRA Groups SHG
Women Empowerment AP

More Telugu News