పబ్‌లో పోలీసులతో గొడవ.. ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పబ్‌లో పోలీసులతో గొడవ.. ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

Vikas Marmat IAS transferred by AP government after pub brawl with police
  • బెంగళూరు పబ్‌లో పోలీసులతో గొడవపడిన వికాస్ మర్మత్ బదిలీ
  • కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి  
  • విధులకు ఆటంకం కలిగించారని పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బదిలీ ఉత్తర్వుల జారీ
  • సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
బెంగళూరులోని ఓ పబ్‌లో పోలీసులతో గొడవపడిన ఘటనలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు పడింది. 'కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. 'కాడా' ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టుకు వెంటనే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

అక్టోబర్ 10న తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ఓ పబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, వయసు నిర్ధారణ కోసం కస్టమర్ల గుర్తింపు పత్రాలు అడిగారు. ఈ క్రమంలో వికాస్ మర్మత్, ఆయన స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిని దూషించి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఫిర్యాదు మేరకు బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితేష్, రోషన్ అనే మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి బాధ్యతలు చూస్తున్న అధికారిపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
Advertisement
Vikas Marmat
IAS officer transfer
Bengaluru pub brawl
Andhra Pradesh government
Kuppam Area Development Authority
Cubbon Park Police Station FIR

More Telugu News