నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన గంటలకే పెటాకులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన గంటలకే పెటాకులు!

Four years of love ends hours after wedding
  • నాలుగేళ్లు ప్రేమించుకున్న జంటకు పెళ్లైన రోజే బ్రేకప్
  • మద్యం మత్తులో భార్య, మామపై దాడి చేసిన ఆర్మీ సైనికుడు
  • రిసెప్షన్ వేదిక నుంచి వరుడు పరారీ, ఆసుపత్రి పాలైన వధువు
  • భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నవవధువు
  • తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయిన యువతి
నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులను దాటి, కుటుంబ సభ్యులను కష్టపడి ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. కానీ, వారి ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఉదయం ఒక్కటైన ఆ జంట.. సాయంత్రానికే విడిపోయింది. రిసెప్షన్‌లో మద్యం మత్తులో వరుడు చేసిన వీరంగంతో వారి నాలుగేళ్ల ప్రేమకథ విషాదాంతమైంది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది.

కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ సమీపంలోని రీతాపురం గ్రామానికి చెందిన రూబెన్ (31) ఆర్మీ సైనికుడిగా పనిచేస్తున్నాడు. కేరళ సరిహద్దులోని పారసాల సమీప గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూబెన్ చాలా కష్టపడ్డాడు. మొదట యువతి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా, చివరికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారు.

దీంతో అక్టోబర్ 12న సోమవారం ఉదయం పారసాలలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం వరుడి స్వగ్రామం రీతాపురంలోని ఒక మ్యారేజ్ హాల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వధువు తండ్రి సంప్రదాయం ప్రకారం కూతురికి కానుకగా ఫర్నిచర్ తీసుకువచ్చారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో, వరుడు రూబెన్ ప్రవర్తనతో వివాదం మొదలైంది. రిసెప్షన్‌లో రూబెన్ ఫుల్లుగా మద్యం తాగి, నిలబడలేని స్థితిలో తూలుతూ కనిపించాడు.

అల్లుడి పరిస్థితిని గమనించిన మామ.. కూతురి దగ్గర ఈ విషయం ప్రస్తావించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రూబెన్.. మామను  దూషించి, దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన భార్యపైనా చేయి చేసుకున్నాడు. ఈ గొడవతో అక్కడ గందరగోళం నెలకొనగా, రూబెన్ వేడుక నుంచి పారిపోయాడు. గాయపడిన వధువు, ఆమె తండ్రి కుళచ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కుళచ్చల్ పోలీస్ స్టేషన్‌లో రూబెన్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రూబెన్ కోసం గాలిస్తున్నారు. అదే రాత్రి వధువు తన తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఉదయం పెళ్లితో ఒక్కటైన జంట సాయంత్రానికే  విడిపోయింది.
Advertisement
Ruben
Kanyakumari
Drunk groom
Wedding break up
Tamil Nadu news
Parasala

More Telugu News