ఓటు హక్కు పరిరక్షణ మరో స్వాతంత్య్ర పోరాటమే: రేవంత్ రెడ్డి
Add ap7am to your home Screen

ఓటు హక్కు పరిరక్షణ మరో స్వాతంత్య్ర పోరాటమే: రేవంత్ రెడ్డి

Protecting the right to vote is another freedom struggle Revanth Reddy
  • 'జ్ఞానేశ్ గో బ్యాక్', 'ఎస్‌ఐఆర్ గో బ్యాక్' అంటూ ఉద్యమించాలని సీఎం పిలుపు
  • ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శ
  • ఈసీ నియామక ప్రక్రియను మార్చడంపై మండిపాటు
  • ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందన్న రేవంత్‌రెడ్డి
ఓటు హక్కును కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమం లాంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో 'సైమన్ గో బ్యాక్' అన్నట్టుగా.. ఇప్పుడు 'జ్ఞానేశ్ గో బ్యాక్', 'ఎస్‌ఐఆర్ గో బ్యాక్' అనే నినాదాలతో పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 'ఓటు బచావో... దేశ్ బచావో' కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో కుమ్మక్కై ఓట్లను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి హయాంలో జరిగిన ఎస్‌ఐఆర్.. ఓటు హక్కు లేని అర్హుల పేర్లను చేర్చడానికే ఉపయోగపడిందని సీఎం గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత మోదీ-అమిత్ షా ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను వాడుకున్న కేంద్రం, అవి సరిపోవన్నట్టు ఇప్పుడు ఎస్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. గతంలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఈసీలను నియమించేదని, కానీ మోదీ ప్రభుత్వం 2023లో సీజేఐ స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చి పారదర్శకతను దెబ్బతీసిందని మండిపడ్డారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు సచిన్ సావంత్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Advertisement
Revanth Reddy
Vote Bachao Desh Bachao
Special Internal Revision
Gyanesh Kumar
Telangana CM
Election Commission of India

More Telugu News