భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

North Andhra devastated by heavy rains Chandrababu Naidu gives key orders to officials
  • భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం పంపిణీకి ఆదేశం
  • ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు
  • తాజా వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాల్లోకి 21 టీఎంసీల అదనపు నీరు
  • రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గుదల
గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు తక్షణ సాయంగా 50 కేజీల బియ్యం అందించాలని ఆదేశించారు. అదే సమయంలో కృష్ణా నదిపై రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.

శనివారం జరిగిన ఈ సమీక్షలో అధికారులు రాష్ట్రంలోని తాజా పరిస్థితిని సీఎంకు వివరించారు. ఉత్తరాంధ్రలో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, పలుచోట్ల నివాస ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. సహాయక చర్యలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా సముద్రంలోకి వెళ్లలేని మత్స్యకారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి అండగా నిలవాలని, తక్షణమే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.

కృష్ణాపై కొత్త బ్యారేజీలు.. నీటి భద్రతపై దృష్టి 
ఈ సందర్భంగా స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతోందని అధికారులు తెలపగా, ఆ నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పులిచింతల-ప్రకాశం బ్యారేజీ మధ్య ఒకటి, ప్రకాశం బ్యారేజీకి దిగువన మరొకటి చొప్పున రెండు కొత్త బ్యారేజీల నిర్మాణం అవసరమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి గతంలో రూపొందించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే, హిర మండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వంశధార నీటిని రిజర్వాయర్‌లోకి తరలించే పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల అధికారులకు సూచించారు.

నిండిన జలాశయాలు.. తగ్గిన వర్షపాతం లోటు 
తాజా వర్షాల వల్ల రాష్ట్రంలోని 29 ప్రధాన రిజర్వాయర్లలోకి భారీగా నీరు వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. సెప్టెంబర్ 23 నాటికి 101 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ, కేవలం మూడు రోజుల్లో 21 టీఎంసీలు పెరిగి 122 టీఎంసీలకు చేరిందని తెలిపారు. ఒక్క ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టుల్లోనే సుమారు 5 టీఎంసీల నీరు అదనంగా చేరిందని వివరించారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు.

గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం 1.20 లక్షల క్యూసెక్కుల నుంచి 3.50 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వంశధారపై గోట్టా బ్యారేజీకి, నాగావళిపై నారాయణపురం ఆనకట్టకు కూడా ఇన్‌ఫ్లో రికార్డు స్థాయిలో పెరిగింది. పెరిగిన ప్రవాహాలను సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లతో పాటు చిన్న, మధ్య తరహా నీటి వనరులను కూడా నింపాలని సీఎం ఆదేశించారు. వరద తగ్గుముఖం పట్టినా, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh rains
North Andhra floods
Krishna River new barrages
Fishermen relief aid
AP reservoir water levels

More Telugu News