పరవాడ ఫార్మా కాలుష్యంపై పవన్ కల్యాణ్ సీరియస్.. 95 కంపెనీలకు నోటీసులు

పరవాడ ఫార్మా కాలుష్యంపై పవన్ కల్యాణ్ సీరియస్.. 95 కంపెనీలకు నోటీసులు

Pawan Kalyan serious on Parawada Pharma pollution 95 companies issued notices
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఫార్మాసిటీపై పీసీబీ చర్యలు
  • సోషల్ మీడియా ఫిర్యాదు ఆధారంగా కాలుష్యంపై తనిఖీలు
  • పరవాడలోని 95 ఫార్మా పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ
  • వ్యర్థాల నిర్వహణపై పరిశ్రమలకు కీలక దిద్దుబాటు చర్యల ఆదేశం
సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాలతో అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని 95 పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుద్ధి చేయని వ్యర్థాలను వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే, పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లలో నల్లటి రంగులో, దుర్వాసనతో కూడిన నీరు ప్రవహిస్తున్నట్లు శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో, వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన పీసీబీ అధికారులను ఆదేశించారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పీసీబీ అధికారులు, వీడియోలో కనిపించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నమూనాలను సేకరించి పరిశీలించగా, శుద్ధి చేయని వ్యర్థ జలాలు వర్షపు నీటి కాలువల్లోకి చేరుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఫార్మాసిటీలోని మొత్తం 95 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా, కాలుష్య నివారణకు పలు కఠినమైన దిద్దుబాటు చర్యలను కూడా పీసీబీ తప్పనిసరి చేసింది. పరిశ్రమల ప్రాంగణంలోనే వర్షపు నీటిని నిల్వ చేయాలని, కలుషిత నీటిని బయటకు వదలరాదని స్పష్టం చేసింది. వ్యర్థాల నిర్వహణను డిజిటలైజ్ చేయాలని, తేదీ, సమయంతో సహా రికార్డ్ చేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫుటేజీని ఆరు నెలల పాటు భద్రపరచాలని సూచించింది. ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థతో కూడిన స్క్రబ్బర్లను వాడాలని, పర్యావరణ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది.

నిర్ణీత సమయంలో సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని, అక్రమంగా వ్యర్థాలను విడుదల చేస్తున్నట్లు తేలిన పరిశ్రమలపై పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ హెచ్చరించింది. తీసుకున్న చర్యలపై ఒక సమగ్ర నివేదికను ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Pawan Kalyan
Parawada Pharma City
APPCB
Pharma pollution
Anakapalli district
Industrial waste management

More Telugu News