స్పీకర్ చాటున దాక్కోవచ్చని భావించిన రాహుల్, రేవంత్‌లకు ఇది "సుప్రీం చెంపపెట్టు": కేటీఆర్

స్పీకర్ చాటున దాక్కోవచ్చని భావించిన రాహుల్, రేవంత్‌లకు ఇది "సుప్రీం చెంపపెట్టు": కేటీఆర్

KTR says Supreme Court ruling is a slap to Rahul Gandhi and Revanth Reddy
  • దానం నాగేందర్ అనర్హతను సమర్థించిన సుప్రీంకోర్టు
  • ఇది రాహుల్, రేవంత్‌కు తగిలిన చెంపపెట్టు అన్న కేటీఆర్
  • ఫిరాయింపుల ద్వారా ప్రజా తీర్పును దొంగిలించాలని చూశారని విమర్శ
  • రాజ్యాంగాన్ని కాపాడాలనే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందన్న హరీశ్ రావు
  • పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని రాహుల్‌కు సవాల్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిలిన "సుప్రీం చెంపపెట్టు" అని అభివర్ణించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి దానం నాగేందర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. "ఫిరాయింపుల ద్వారా ప్రజా తీర్పును దొంగిలించి, స్పీకర్ చాటున దాక్కోవచ్చని రాహుల్, రేవంత్ భావించారు. స్పీకర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహించే వారి ప్రయత్నాలను ఈ తీర్పు బట్టబయలు చేసింది" అని కేటీఆర్ ఆరోపించారు.

త్వరలో ఖైరతాబాద్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలు మూడేళ్ల ద్రోహానికి, హామీల ఉల్లంఘనకు తగిన తీర్పు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. "ఒక వికెట్ పడింది.. త్వరలో మరిన్ని పడతాయి" అని హెచ్చరిస్తూ, తన పోస్ట్ చివరలో "మార్క్ మై వర్డ్స్, ఎమ్మెల్యే చోర్ @రాహుల్‌గాంధీ" అని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై హరీశ్ రావు ఫైర్

సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ శాసనసభ ఉప నాయకుడు హరీశ్ రావు కూడా స్వాగతించారు. "రాజ్యాంగాన్ని కాపాడతాం" అని చెప్పే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇది చెంపపెట్టు అని అన్నారు. "పదేపదే 'సంవిధాన్ బచావో' అని నినదించే రాహుల్ గాంధీకి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురైంది. ఆయనకు నిజంగా రాజ్యాంగంపై నమ్మకం ఉంటే, కాంగ్రెస్‌లో చేరిన మిగతా ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామా చేయించి, తిరిగి ప్రజా తీర్పు కోరాలి" అని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడి, తెలంగాణలో తమ పార్టీ చర్యలపై మౌనంగా ఉండటం సరికాదని హరీశ్ రావు విమర్శించారు. "సంవిధాన్ బచావో అనేది రాజ్యాంగ నిబద్ధతా లేక కేవలం రాజకీయ నినాదమా?" అని ఆయన ప్రశ్నించారు.


Advertisement
KTR
Danam Nagender
Rahul Gandhi
Revanth Reddy
Supreme Court
Anti Defection Law

More Telugu News