కొత్త సెక్రటేరియట్‌పై వివాదం: విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత్స్యకారుల భేటీ

కొత్త సెక్రటేరియట్‌పై వివాదం: విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత్స్యకారుల భేటీ

Controversy over new Secretariat Fishermen meeting against Vijay government
  • చెన్నైలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు
  • నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నేడు సమావేశం
  • తమ ఉపాధి, హక్కులకు భంగం కలుగుతుందని ఆవేదన
  • ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన నూతన సచివాలయ భవన నిర్మాణ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెన్నైలోని పట్టినపాక్కం తీరప్రాంతంలో ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది మత్స్యకార గ్రామాల ప్రజలు నేడు (మంగళవారం) సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టు తమ జీవనోపాధిని, సంప్రదాయ హక్కులను దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టినపాక్కంలోని ముల్లికుప్పం సామాజిక సంక్షేమ కేంద్రం వద్ద ముల్లికుప్పం-శ్రీనివాసపురం, ముల్లిమానగర్ మత్స్యకార గ్రామాల పంచాయతీ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నోర్‌లోని నెట్టుకుప్పం నుంచి నైనార్‌కుప్పం వరకు గల వివిధ గ్రామాల ప్రతినిధులు, స్థానికులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన నోటీసులు అందజేయాలని వారు యోచిస్తున్నారు. తమ జీవనోపాధికి మూలాధారమైన సముద్ర మార్గాలకు ఈ నిర్మాణం వల్ల ఆటంకం కలుగుతుందని, వలలు ఆరబెట్టుకోవడానికి, పడవలు నిలుపుకోవడానికి స్థలం లేకుండా పోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించని పక్షంలో, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో ఉన్న సచివాలయంలో స్థలాభావం నెలకొనడంతో, పరిపాలన సౌలభ్యం నిమిత్తం సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో పట్టినపాక్కంలోని 25 ఎకరాల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని టీవీకే ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
Advertisement
Vijay
Tamilaga Vettri Kazhagam
New Secretariat Protest
Pattinapakkam Fishermen
Chennai Coastal Development
TVK Government Projects

More Telugu News