అల్లూరి జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన.. 15 జిల్లాలకు రాకపోకల బంద్
- జీకే వీధి మండలం చిన్న గంగవరం వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
- ఏపీ-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు బంద్
- శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మించాలని కోరుతున్న ప్రజలు
ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల తీవ్రతకు జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా నిర్మించిన వంతెన నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దాదాపు 15 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నిత్యావసర సరుకుల రవాణాతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం ఈ 15 గ్రామాల గిరిజనులు ఈ ఒక్క వంతెనపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తుంటారు.
గతంలో 2024లో సంభవించిన వర్షాలకు ఇక్కడున్న ప్రధాన వంతెన ధ్వంసం కాగా, అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన రాకపోకల కోసం ప్రత్యామ్నాయ వంతెనను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ తాత్కాలిక నిర్మాణం కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇకనైనా తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, శాశ్వత ప్రాతిపదికన వంతెనను వెంటనే నిర్మించి తమ రాకపోకల సమస్యను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.