హైదరాబాద్‌ హాస్టళ్లకు 'హైడ్రా' స్ట్రిక్ట్ వార్నింగ్.. 3 నెలలే డెడ్‌లైన్!

హైదరాబాద్‌ హాస్టళ్లకు 'హైడ్రా' స్ట్రిక్ట్ వార్నింగ్.. 3 నెలలే డెడ్‌లైన్!

HYDRA strict warning to Hyderabad hostels 3 months deadline
  • హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై హైడ్రా ఉక్కుపాదం
  • ప్రమాదకర భవనాలను ఖాళీ చేసేందుకు 3 నెలల గడువు
  • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు
  • విద్యార్థుల భద్రతతో రాజీపడొద్దని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం
హైదరాబాద్‌ నగరంలోని హాస్టళ్ల భద్రతపై హైడ్రా కఠిన నిబంధనలు జారీ చేసింది. సురక్షితం కాని, అనుమతులు లేని భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లను మూడు నెలల్లోగా సురక్షితమైన భవనాల్లోకి మార్చాలని నిర్వాహకులకు అల్టిమేటం ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తనిఖీలు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రమాదకర భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేసింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన హాస్టళ్ల నిర్వాహకులు, భవన యజమానులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాస్టళ్లలో నివసించే విద్యార్థులు, ఉద్యోగుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రతి హాస్టల్‌లో అగ్నిమాపక భద్రత, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, నిర్మాణ పటిష్ఠత తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర భవనాల్లో హాస్టళ్లు నడిపేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇటీవల గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మరణించడం, ఢిల్లీలో హాస్టల్ భవనం కూలి పలువురు చనిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో హైడ్రా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుమతులు లేని భవనాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుంటామని రంగనాథ్ తెలిపారు.

కేవలం లాభార్జన కోసం భద్రతను విస్మరించవద్దని, హాస్టల్‌ వాసులను తమ సొంత బిడ్డల్లా భావించి వసతులు కల్పించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య అగ్నిప్రమాదాలు నివారణ చర్యల, ఫైర్ సేఫ్టీ నిబంధనలపై వీడియోల ద్వారా నిర్వాహకులకు సమగ్ర అవగాహన కల్పించారు.
Advertisement
HYDRA
Hyderabad Hostels
AV Ranganath
Fire Safety Norms
Building Demolition
Hostel Regulations

More Telugu News