వీధి నాటకాలు ఆడకండి.. కావాలంటే వైసీపీ నేతలకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తా!: సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి
Add ap7am to your home Screen

వీధి నాటకాలు ఆడకండి.. కావాలంటే వైసీపీ నేతలకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తా!: సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి

Stop dramas I will get unemployment allowance for YSRCP leaders says SEEDAP Chairman Deepak Reddy
  • జెన్-జీ దీక్షల పేరుతో వైసీపీ నేతలు వీధి నాటకాలు ఆడుతున్నారని దీపక్ రెడ్డి విమర్శ
  • రాజకీయ నిరుద్యోగులుగా మారిన వైసీపీ నేతలకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని ఎద్దేవా
  • కూటమి ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడి
  • సీడాప్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ, 14 రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టీకరణ
  • అసెంబ్లీకి వచ్చి దమ్ముంటే చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్
కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తు, ఉద్యోగ కల్పనపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతుంటే, గొడ్డలి పార్టీ నేతలు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా మారి వీధి నాటకాలు ఆడుతున్నారని సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై 'జెన్-జీ' దీక్షల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి గొడవ చేస్తున్నారని, కానీ అక్కడ కూర్చున్న వారిలో ఒక్కరు కూడా యువకులు లేరని, 60 ఏళ్లు దాటిన రాజకీయ నిరుద్యోగులే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దీపక్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నేతల తీరుపై పదునైన విమర్శలు చేశారు.

రాజకీయ నిరుద్యోగుల దయనీయ పరిస్థితి

"ప్రజలు అధికారం నుంచి గెంటేయడంతో వైసీపీ నేతలంతా రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 'వై నాట్ 175' అంటూ విర్రవీగిన వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జగన్ పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయి, ఏపీకి రాకుండా కర్ణాటక ప్యాలెస్‌లో ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు రెండేళ్లుగా పనిలేకుండా ఇంట్లో కూర్చుంటే భార్యలు కూడా నిలదీస్తుండటంతో, ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలతో నాటకాలు ఆడుతున్నారు. 

బొత్స సత్యనారాయణ బండి గ్యారేజ్‌కు వెళ్ళింది. కొడాలి నాని గుట్కాలు తిని ఆరోగ్యం పాడుచేసుకుని, అరెస్ట్ భయంతో బతుకుతున్నాడు. రోజా గారు మళ్లీ పాత టీవీ షోల దారి పట్టారు. అనంతపురంలో ‘గుడ్ మార్నింగ్’ నేతకు ప్రజలు శాశ్వతంగా ‘గుడ్ నైట్’ చెప్పారు. వీరి పరిస్థితి చూస్తే జాలి వేస్తోంది. అందుకే ఓ ఆఫర్ ఇస్తున్నా.. ఉద్యోగాలు కావాల్సిన వైసీపీ పార్టీ నేతల లిస్ట్ ఇవ్వండి. మీకు స్కిల్స్ నేర్పినా ప్రయోజనం లేదు, క్రిమినల్ రికార్డులున్న మిమ్మల్ని ఏ కంపెనీ తీసుకోదు. కాబట్టి మీ అందరికీ ప్రభుత్వ 'నిరుద్యోగ భృతి' ఇప్పించే ప్రయత్నం చేస్తా" అని దీపక్ రెడ్డి హామీ ఇచ్చారు.

కూటమి పాలనలో ఉద్యోగాల విప్లవం
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని దీపక్ రెడ్డి తెలిపారు. "రాష్ట్రానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 6 రెట్లు (600%) పెరిగాయి. రూ. 11.37 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి, వీటితో 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. మరో రెండేళ్లలో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. నారా లోకేశ్ 'యువగళం'లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా ఇప్పటికే 7,28,347 ఉద్యోగాలు కల్పించాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం" అని గణాంకాలతో వివరించారు.

సీడాప్ ద్వారా యువతకు స్వర్ణయుగం

సీడాప్ ద్వారా యువతకు అందిస్తున్న శిక్షణ, సౌకర్యాలను దీపక్ రెడ్డి పూసగుచ్చినట్లు వివరించారు. "రాష్ట్రవ్యాప్తంగా 1501 కేంద్రాల ద్వారా 7,79,804 మందికి శిక్షణ ఇచ్చాం. గత వైసీపీ హయాంలో 2020-21లో సీడాప్ ద్వారా ఇచ్చింది కేవలం 7,295 ఉద్యోగాలే. శిక్షణ సంస్థలకు బిల్లులు కూడా చెల్లించకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవస్థను నాశనం చేశారు. కానీ మేము, ఒక్కో విద్యార్థిపై 3 నెలల్లో లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ రవాణా, భోజనం, వసతి సహా 14 రకాల సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నాం. శిక్షణ పొందిన వారికి 95 శాతం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. మా పనితీరుకు 'స్కోచ్ అవార్డు'తో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు దక్కాయి. కేంద్రం మరో రూ. 1022 కోట్లు అదనపు నిధులు మంజూరు చేసింది" అని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న 'నైపుణ్యం' పోర్టల్ ద్వారా యువతకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తున్నామని చెప్పారు.

దమ్ముంటే అసెంబ్లీకి రండి
 
"గత పాలనలో ఏపీపీఎస్సీ ద్వారా యువత జీవితాలతో ఆడుకున్నందుకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మరో మెగా డీఎస్సీకి ప్రభుత్వం సిద్ధమవుతుంటే, వైసీపీ నేతలు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. యువతకు నెలకు రూ. 3,000 భృతి ఇవ్వడం కంటే, 3 నెలల్లోనే వారిపై రూ. లక్ష పెట్టుబడి పెట్టి జీవితాంతం నిలబడేలా చేస్తున్నాం. మీకు నిజంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, 17న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు రండి. ప్రతిపక్ష హోదా లేదని సాకులు చెప్పకుండా, ఎమ్మెల్యేలుగానైనా వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ముందా? ప్రభుత్వ అభివృద్ధిని ఎదుర్కొనే ధైర్యం లేకనే సభ నుంచి పారిపోతున్నారు. మీ చిల్లర రాజకీయాలను యువత నమ్మదు, మీ తీరు మార్చుకోకపోతే ఉన్న 11 సీట్లు కూడా గల్లంతవుతాయి" అని దీపక్ రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Deepak Reddy
SEEDAP Chairman
Andhra Pradesh Job Creation
YSRCP Unemployment Allowance
Nara Lokesh Skill Development
AP Kootami Government Vision

More Telugu News