హద్దులు దాటొద్దు, భాష జాగ్రత్త!: జనసైనికులకు మరోసారి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan directs Janasainiks to maintain restraint and follow language guidelines
  • సోషల్ మీడియా వాడకంపై జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ మార్గదర్శకాలు
  • వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడొద్దని స్పష్టం
  • కూటమి ప్రభుత్వ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని సూచన
  • పార్టీ క్రమశిక్షణ, అంతర్గత విషయాలపై 9 కీలక మార్గదర్శకాలు జారీ
సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు పోస్టులు పెట్టేటప్పుడు, వివిధ అంశాలపై స్పందించేటప్పుడు భాష విషయంలో సంయమనం పాటించాలని, పరిధి దాటవద్దని ఆయన స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తరుణంలో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

జనసేన శ్రేణులు పాటించాల్సిన 9 మార్గదర్శకాలు:

1. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు.
2. పార్టీల సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా స్పందించాలి.
3. ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలాన్ని వాడవద్దు.
4. మహిళలను గౌరవించి మాట్లాడాలి.
5. పార్టీ అంతర్గత అంశాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడరాదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని పార్టీ ఉపేక్షించదు.
6. పార్టీ క్రమశిక్షణకి విఘాతం కలిగించేలా, జనసైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి ప్రభావానికి లోను కావొద్దు.
7. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి.
8. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి.
9. పార్టీ అభ్యున్నతి, పార్టీ కోసం కష్టించి పనిచేసే జన సైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పి కొట్టండి.

రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా ద్వారా పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి కుట్రలను తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణే అత్యంత కీలకమని, దానికి విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈ ప్రకటన ద్వారా పార్టీ అధిష్ఠానం గట్టి హెచ్చరికలు పంపింది.

ఇటీవల ఒంగోలులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తాజా మార్గదర్శకాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Advertisement
Pawan Kalyan
Janasena Party
Social Media Guidelines
Janasainiks
Andhra Pradesh Politics
Alliance Government

More Telugu News