ప్రతిపక్షాల హేళనలకు అభివృద్ధితో సమాధానమిచ్చాం: రామ్మోహన్ నాయుడు
- భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం సింహద్వారంలా నిలుస్తుందన్న రామ్మోహన్ నాయుడు
- ఉత్తరాంధ్రలో ప్రగతి పరుగులు పెడుతోందని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితమైన చారిత్రాత్మక ఘట్టంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాల హేళనలకు తమ అభివృద్ధి పనులతోనే సమాధానమిచ్చామని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక బలమైన సింహద్వారంలా నిలుస్తుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
"ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కేవలం ఎర్రబస్సులు మాత్రమే తిరిగే వెనుకబడిన ప్రాంతం అని కొందరు అవహేళన చేశారు. కానీ ఈ రోజు కళ్లు తెరిచి చూడండి.. ఎర్రబస్సులు తిరిగిన నేలపైనే అధునాతన ఎయిర్‌బస్సులు ల్యాండ్ అయ్యే స్థాయికి ఉత్తరాంధ్ర ఎదిగిందని నిరూపించాం" అని విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ఉత్తరాంధ్రలో ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడించిన రామ్మోహన్‌నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం గర్వించే నాయకుడు ప్రధాని మోదీ నేతృత్వంలో ‘వికసిత్ భారత్’, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ‘విజన్ 2047’ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పారిశ్రామికంగా, పర్యాటకంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.