Advertisement

భోగాపురం విమానాశ్ర‌యం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వే.. ఈ గడ్డపై అడుగుపెట్టడం ఎంతో గర్వకారణం: ప్రధాని మోదీ

Narendra Modi says Bhogapuram Airport is a new runway for Uttarandhra development
  • ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
  • రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు
  • గిరిజన మహిళల థింసా నృత్యం ప్రపంచ రికార్డు సాధించిందన్న ప్రధాని
  • చంద్రబాబు దార్శనికతను మనస్ఫూర్తిగా అభినందించిన మోదీ
పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపై అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సహా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. నేటి రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక కీలకమైన రోజని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయ నృత్యమైన 'థింసా' ప్రదర్శన తనను మధురానుభూతికి లోనుచేసిందని ప్రధాని తెలిపారు. ఒకేసారి 13 వేల మంది గిరిజన మహిళలు ఈ నృత్యం చేయడం ఒక అద్భుతమని, ఇది ప్రపంచ రికార్డు సృష్టించిందని కొనియాడారు. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను ప్రధాని మోదీ హృదయపూర్వకంగా అభినందించారు.

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త 'రన్‌వే'గా పనిచేస్తుందని మోదీ ఉద్ఘాటించారు. ఇది ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ఒక 'లాంచ్‌ప్యాడ్' అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో దేశంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒకే కుటుంబం పేర్లు కనిపించేవని, కానీ తమ ప్రభుత్వం మహనీయుల పేర్లను పెడుతోందని స్పష్టం చేశారు. "అయోధ్యలో విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టాం. పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేరుతో ఎయిర్‌పోర్ట్ ప్రారంభించాం. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం" అని ప్రధాని వివరించారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Narendra Modi
Bhogapuram International Airport
Alluri Sitarama Raju Airport
Andhra Pradesh Development Projects
Chandrababu Naidu
Uttarandhra Development

More Telugu News