భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం.. సరికొత్త చరిత్రకు నాంది పలికాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Bhogapuram Airport is a jewel for North Andhra
  • ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్ర ప్రారంభమైందన్న సీఎం చంద్రబాబు
  • భోగాపురం ఎయిర్‌పోర్టును ఉత్తరాంధ్రకు మణిహారంగా అభివర్ణన
  • భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు వెల్లడి
  • అవహేళన చేసిన వారు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారన్న సీఎం
  • రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టీకరణ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం లాంటిదని, ఈ ప్రాంత దశ, దిశను మార్చే శక్తి దీనికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 'అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం' ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదంటూ అవహేళన చేసిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని, కానీ నేడు ఇక్కడకు ఎయిర్‌బస్ వచ్చిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి అడ్డుపడిన శక్తులను ప్రజలు తిరస్కరించారని అన్నారు.

ఈ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు ప్రశంసించారు. "రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకున్నాం" అని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనంగా నిలిచే ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమని అన్నారు. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం, దీనికి తొలి అడుగులు వేసిన అశోక్‌ గజపతిరాజు, ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా ఈ ప్రాంతం వారే కావడం విశేషమని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల పూర్తిపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, 2028 నాటికి రాజధాని అమరావతి తొలి దశ పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను కాపాడింది, రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనే అని కొనియాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో తెలంగాణ దశ మారినట్లే, భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న రెండేళ్లలో ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులతో 189 ప్రాజెక్టులు తీసుకొస్తామని, తద్వారా 5.57 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తామని, 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి సైతం అనుమతులు వచ్చాయని తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మించి, టూరిజం, ఫార్మా రంగాలను అభివృద్ధి చేసి ఉత్తరాంధ్ర స్వరూపాన్ని మారుస్తామన్నారు. త్వరలోనే ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజులు వస్తాయని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Bhogapuram International Airport
North Andhra Development
GMR Group
Rammohan Naidu
Andhra Pradesh Infrastructure

More Telugu News