Advertisement

భార్య జీతం 8 లక్షలు.. భర్త ఉద్యోగానికి ఏఐ ముప్పు.. భరణంపై హైకోర్టు కీలక తీర్పు

Bombay High Court denies alimony to wife earning 8 lakhs as AI threatens husbands job
  • భర్త కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న భార్యకు భరణం నిరాకరణ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భర్త ఐటీ ఉద్యోగానికి ముప్పు ఉందని కోర్టు వ్యాఖ్య
  • రూ. లక్ష భరణం కోరిన రూ. 8 లక్షలు సంపాదిస్తున్న భార్య 
  • విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువన్నది భరణానికి కారణం కాదన్న న్యాయస్థానం
  • ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు
భర్త కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న భార్యకు భరణం ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా భర్త ఐటీ ఉద్యోగానికి ముప్పు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో భరణం మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ఓ మహిళ, తన భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఆమె న్యూఢిల్లీకి చెందిన ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ నెలకు 8 లక్షల రూపాయలు (8,700 డాలర్లు) సంపాదిస్తున్నారు. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. అయితే, తన భర్త జీతం కన్నా తన సంపాదన ఎక్కువగా ఉన్నప్పటికీ, విదేశాల్లో జీవన వ్యయం అధికంగా ఉందని, అందువల్ల భరణం కింద నెలకు లక్ష రూపాయలు ఇప్పించాలని ఆమె కోరారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ భారతీ డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం విచారించింది. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉందనే కారణంతో భరణం కోరడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో, ఐటీ రంగంలో పెరుగుతున్న పోటీ, ఏఐ వాడకం వల్ల భర్త ఉద్యోగానికే ప్రమాదం పొంచి ఉందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కారణాలతో ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇదే కేసులో గతంలో ఫ్యామిలీ కోర్టు కూడా ఆమె భరణం అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, కేసు విచారణ ఖర్చుల కింద రూ. 25,000 చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, పెద్ద బిడ్డ తండ్రి వద్ద, చిన్న బిడ్డ తల్లి వద్ద ఉంటున్నారు.
Advertisement
Bombay High Court
Alimony ruling
AI job threat
IT professional salary
Maintenance law India
High earning wife alimony

More Telugu News