Advertisement

నేపాల్ కొత్త రూపాయి నాణెంపై వివాదాస్పద మ్యాప్!

Nepal controversial map on new rupee coin
  • రూపాయి నాణెంపై వివాదాస్పద మ్యాప్ ముద్రణకే నేపాల్ మొగ్గు
  • లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీలను తమవిగా చూపుతూ నిర్ణయం
  • ప్రతిపక్షాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన బాలెన్ షా ప్రభుత్వం
  • మొనస్టరీ చిత్రంతో నాణెం ముద్రించాలన్న గత నిర్ణయం రద్దు
  • ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామన్న భారత్
భారత్‌తో సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ, నేపాల్ మరోసారి తన పాత వైఖరినే ప్రదర్శించింది. వివాదాస్పద ప్రాంతాలైన లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీలను తమ భూభాగంలో చూపిస్తూ రూపొందించిన మ్యాప్‌తోనే నూతన రూపాయి నాణేన్ని ముద్రించాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తుండగా, అవి ఉత్తరాఖండ్‌లో అంతర్భాగమని భారత్ స్పష్టం చేస్తోంది.

వాస్తవానికి, ప్రస్తుత ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదాస్పద మ్యాప్‌ను నాణెం నుంచి తొలగించి, దాని స్థానంలో ఒక మఠం చిత్రాన్ని ముద్రించాలని తొలుత భావించింది. అయితే, దేశంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాత మ్యాప్‌తోనే నాణేన్ని ముద్రించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు నేపాల్ జాతీయ బ్యాంక్ అధికారి గురు ప్రసాద్ పౌడెల్ అధికారికంగా ప్రకటన చేశారు. 2020లో అప్పటి కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ దేశంలో కలుపుతూ కొత్త రాజకీయ పటాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఈ అంశంపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యనైనా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది.                                
Advertisement
Nepal
New Rupee Coin
Controversial Map
India Nepal Border Dispute
Lipulekh Kalapani Limpiyadhura
Nepal Rastra Bank

More Telugu News