భర్తల ఉద్యోగాలు ఊడేలా భార్యల ఫిర్యాదులు: సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

Supreme Court concern over wives complaining against husbands to employers
  • భర్తలు పనిచేసే సంస్థలకు కొందరు భార్యలు ఫిర్యాదు చేస్తున్నారన్న సుప్రీంకోర్టు
  • దీని వల్ల భర్తలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్య
  • జీవిత భాగస్వామి జీవనోపాధిని దెబ్బతీయడం తీవ్రమైన అంశమన్న సుప్రీంకోర్టు

వైవాహిక వివాదాల నేపథ్యంలో కొందరు మహిళలు తమ భర్తలు పనిచేసే సంస్థలకు ఫిర్యాదులు చేస్తూ, వారి జీవనోపాధి దెబ్బతినేలా ప్రవర్తించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్తలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అది చివరికి భార్యలకు అందే భరణం (జీవనభృతి)పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. అసోంలో నమోదైన ఒక పరువునష్టం కేసును ఉత్తర్ ప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.


ఈ విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానిస్తూ.. "ఇటీవలి కాలంలో వివాహ సంబంధిత గొడవల వల్ల భర్తలు పనిచేసే కంపెనీలు లేదా సంస్థలకు భార్యలు ఫిర్యాదు చేయడం ఒక ధోరణిగా మారింది. విడాకులు కోరడం వేరు. కానీ జీవిత భాగస్వామి జీవనోపాధినే దెబ్బతీయడం అత్యంత తీవ్రమైన అంశం" అని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారైన తన భర్త సేవా నియమాలకు విరుద్ధంగా వ్యక్తిగత వ్యాపారం నడుపుతున్నాడంటూ సదరు మహిళ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆమెపై భర్త స్నేహితుడు పరువునష్టం కేసు దాఖలు చేశారు.


ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ వివాదంలో సామరస్యపూరిత పరిష్కారానికి అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపింది. పరస్పర ఆరోపణలన్నీ విరమించుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మహిళకు అత్యున్నత కోర్టు సూచించింది.
Advertisement
Supreme Court of India
Matrimonial disputes
Justice BV Nagarathna
Husband job loss
Indian Air Force
Maintenance and alimony

More Telugu News