దోమల్ని వెంటాడి మరీ చంపే మైక్రో డ్రోన్‌.. ప్రాథమిక పరీక్షలు సక్సెస్‌!

Torniol develops 40 gram micro drone to eliminate mosquitoes mid air
  • దోమలను వేటాడే మైక్రో డ్రోన్‌ను అభివృద్ధి చేస్తోన్న అమెరికా స్టార్టప్‌
  • తొలి పరీక్షలో గాల్లో కీటకాన్ని విజయవంతంగా చంపిన డ్రోన్‌
  • డ్రోన్‌లో అల్ట్రాసోనిక్‌ సెన్సర్లు, మైక్రోఫోన్లు
  • దోమ జాతిని కూడా గుర్తించేలా టెక్నాలజీ రూపకల్పన
  • పది డ్రోన్లతో చదరపు కిలోమీటర్‌ పరిధిని కవర్‌ చేయొచ్చని అంచనా
  • నగరాల స్థాయిలో దోమల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ
దోమలను నిర్మూలించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే రోజులు దగ్గరపడుతున్నాయి. రసాయనాలు పిచికారీ చేయకుండా, గాల్లో ఎగురుతున్న దోమలను గుర్తించి వెంటాడి అంతం చేసే సూక్ష్మ డ్రోన్‌ను ఇంజినీర్లు అభివృద్ధి చేస్తున్నారు. అమెరికాకు చెందిన టోర్నియోల్‌ అనే స్టార్టప్‌ రూపొందిస్తున్న ఈ మైక్రో డ్రోన్‌ ఇటీవల పరీక్షల్లో గాల్లో ఎగురుతున్న ఓ కీటకాన్ని ఢీకొట్టి చంపేసింది. దోమల నిర్మూలన దిశగా ఇది కీలక ముందడుగని సంస్థ తెలిపింది.

40 గ్రాముల డ్రోన్‌
అలెక్స్‌ టౌసెంట్‌, క్లోవిస్‌ పిడాలూ స్థాపించిన ఈ సంస్థ కేవలం 40 గ్రాముల బరువున్న డ్రోన్లను తయారు చేస్తోంది. వీటిలో స్మార్ట్‌ఫోన్‌ల్లో ఉండే మైక్రోఫోన్లు, కార్ల పార్కింగ్‌లో ఉపయోగించే అల్ట్రాసోనిక్‌ సెన్సర్లు, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు దోమల కదలికలను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకునేలా రూపొందిస్తున్నారు.

మొదటి పరీక్ష విజయవంతం
జులై 14న నిర్వహించిన పరీక్షల్లో డ్రోన్‌ ఎగురుతూ ఓ కీటకాన్ని వెంబడించి ఢీకొట్టింది. దీనిని సంస్థ తమ తొలి ‘ఎయిర్‌-టు-ఎయిర్‌ కిల్‌’గా ప్రకటించింది. అయితే ఈ పరీక్షలో తుది హార్డ్‌వేర్‌ను ఉపయోగించలేదు. డ్రోన్‌, లక్ష్య వస్తువును ప్రత్యేక మోషన్‌ క్యాప్చర్‌ వ్యవస్థతో ట్రాక్‌ చేసి కంప్యూటర్‌ నుంచి డ్రోన్‌కు ఆదేశాలు పంపించారు. త్వరలోనే ఈ వ్యవస్థను పూర్తిగా డ్రోన్‌లోనే అమర్చనున్నట్లు సంస్థ తెలిపింది.

దోమలను ఎలా గుర్తిస్తుంది?
తుది రూపంలో ఈ డ్రోన్‌ అల్ట్రాసోనిక్‌ తరంగాలను విడుదల చేసి వాటి ప్రతిధ్వనిని మైక్రోఫోన్లతో విశ్లేషిస్తుంది. దోమ రెక్కలు కొట్టే సమయంలో ఏర్పడే ప్రత్యేక డాప్లర్‌ సిగ్నల్‌ను గుర్తించి ఇతర కీటకాల నుంచి వాటిని వేరు చేస్తుంది. అవసరమైతే దోమ జాతి, లింగాన్ని కూడా గుర్తించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తర్వాత గోడలు, ఇతర అడ్డంకులను తప్పించుకుంటూ లక్ష్యాన్ని చేరుకుని ఢీకొడుతుంది.

లక్ష్యం ఇదే
ఒక చదరపు కిలోమీటర్‌ పరిధిలో కేవలం పది డ్రోన్లతో దోమలను నిర్మూలించవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఈ సామర్థ్యాన్ని ఇంకా వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించలేదు. భవిష్యత్తులో నగరాల స్థాయిలో డ్రోన్‌ల సమూహాలను ఉపయోగించి దోమల నిర్మూలన చేపట్టాలన్నదే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.
Advertisement
Torniol
Mosquito killing drone
Micro drone technology
Alex Toussaint
Pest control drones
Autonomous insect hunter

More Telugu News