రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోంది: జనసేన ఎమ్మెల్యే విజయ్
- హిందుత్వంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న విజయ్
- పవన్ ను జడ శ్రవణ్ టార్గెట్ చేయడం వెనుక తాడేపల్లి పెద్దలు ఉన్నారని ఆరోపణ
- జడ శ్రవణ్, రావణ్, ప్రకాశ్ రాజ్ పెయిడ్ ఆర్టిస్టులని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో మతాల మధ్య చిచ్చుపెట్టి, అలజడులు సృష్టించేందుకు వైసీపీ తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన రాజకీయ క్రీడను ప్రజలంతా గమనించాలని కోరారు.
రాష్ట్రంలో సనాతన ధర్మం, హిందుత్వంపై కావాలనే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విజయ్ మండిపడ్డారు. ఏలూరు సభలో జడ శ్రవణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం వెనుక తాడేపల్లి పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలకు ప్లాన్ చేస్తున్న ఈ ముఠాకు, తాడేపల్లికి ఉన్న ఆర్థిక, రాజకీయ సంబంధాల గుట్టును పోలీసులు పూర్తిగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
జగన్‌కు వ్యతిరేకంగా తానే రూ. 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్న జడ శ్రవణ్‌కు అసలు అన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో విషం చిమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. యూట్యూబర్ రావణ్, నటుడు ప్రకాశ్ రాజ్, అలాగే జడ శ్రవణ్‌లకు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. వీరంతా కేవలం ఒక అజెండా ప్రకారం పనిచేస్తున్న 'పెయిడ్ ఆర్టిస్ట్‌లు' అని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు, మతాలకు సమాన గౌరవం లభిస్తుందని స్పష్టం చేసిన ఆయన... హిందుత్వంపై, సనాతన ధర్మంపై ఇలాంటి కుటిల యత్నాలు కొనసాగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.