రావణ్‌పై పెట్టిన ఉపా కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలి: అంబటి, సీపీఐ నారాయణ

Ambati Rambabu and CPI Narayana demand immediate withdrawal of UAPA case against Ravan
  • పవన్ ను, హిందూ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రావణ్
  • విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైసీపీ, లెఫ్ట్ పార్టీలు
  • రావణ్‌పై పెట్టిన కేసు చట్టవిరుద్ధమన్న అంబటి, నారాయణ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ పై పోలీసులు ఉపా (UAPA) కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే, దేశద్రోహులపై ఉపయోగించే ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్యను ఇప్పటికే వైసీపీ ఖండిస్తుండగా... తాజాగా కమ్యూనిస్టులు కూడా ఈ జాబితాలో చేరారు. విజయవాడ వేదికగా జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీతో పాటు లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.


కేంద్ర, రాష్ట్రాల్లోని కూటమి ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక ప్రజా సమస్యల్లో చిక్కుకుపోయాయని సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు విషయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే రావణ్‌ను టార్గెట్ చేస్తూ ఈ రాజకీయ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అతడిపై మోపిన అక్రమ 'ఉపా' కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేసి, అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని ప్రయోగించిందని మండిపడ్డారు. రావణ్‌పై పెట్టిన కేసు చట్టవిరుద్ధమని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Bacchalakuri Joseph Ravan
Ambati Rambabu
CPI Narayana
UAPA case Andhra Pradesh
Pawan Kalyan
YSRCP CPI protest

More Telugu News