డిజిటల్ టికెట్లపై కొత్త నిబంధన.. రైల్వే శాఖ కీలక ప్రకటన

Indian Railways New Rules for Digital Tickets Key Announcement
  • వాట్సాప్ ఫార్వార్డ్‌లు, స్క్రీన్‌షాట్లు ఇకపై చెల్లవని స్పష్టం
  • టికెట్ బుక్ చేసిన ఫోన్‌లోనే ఒరిజినల్ టికెట్ చూపించాలని స్పష్టీకరణ
  • ఈ నిబంధనపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు
భారతీయ రైల్వే శాఖ డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల విషయంలో ప్రయాణికులకు కీలక స్పష్టతనిచ్చింది. 'రైల్ వన్' యాప్ ద్వారా బుక్ చేసుకున్న డిజిటల్ టికెట్లను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా బుకింగ్ చేసిన మొబైల్ ఫోన్‌లోనే చూపించాలని స్పష్టం చేసింది. టికెట్ స్క్రీన్‌షాట్లు, పీడీఎఫ్ కాపీలు లేదా వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫార్వార్డ్ చేసిన కాపీలు చెల్లవని తేల్చి చెప్పింది. వీటిని ప్రయాణానికి సరైన ఆధారాలుగా పరిగణించబోమని రైల్వే అధికారులు వెల్లడించారు.

డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూలై 8న తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వెల్లడించింది. ఇటీవల ఓ ప్రయాణికుడు వాట్సాప్ స్క్రీన్‌షాట్ చూపించగా, అధికారులు అతడికి జరిమానా విధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రయాణికులు రైలు బయలుదేరక ముందే టికెట్ బుక్ చేసుకోవాలని, ప్రయాణ సమయంలో టికెట్ బుక్ చేసిన ఫోన్‌తో పాటు తప్పనిసరిగా అసలు గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

అయితే, రైల్వే శాఖ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఒకరే టికెట్లు బుక్ చేసే సందర్భాల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధుల ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే సాధకబాధల గురించి పలువురు ప్రశ్నిస్తున్నారు. టికెట్ బుక్ చేసిన వ్యక్తి ప్రయాణంలో లేకపోతే ఇబ్బందులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల ఆందోళనలపై రైల్వే శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 'రైల్ వన్' యాప్‌లో డిజిటల్ పద్ధతిలో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం రాయితీ లభిస్తున్నప్పటికీ, తాజాగా కఠినతరం చేసిన ఈ నిబంధన అనేకమందికి ఇబ్బందికరంగా మారింది.
Advertisement
Indian Railways
Digital Tickets
Rail One App
Unreserved Ticket Booking
Railway Ticket Rules

More Telugu News