వాట్సాప్ 'యూజర్‌నేమ్‌' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా

WhatsApp Username controversy Meta submits explanation to Indian Government
  • యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై ప్రభుత్వ నోటీసులకు వాట్సాప్ వివరణ
  • ఆన్‌లైన్ మోసాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన
  • ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీచర్ తీసుకురాబోమని హామీ
  • టెలిగ్రామ్, సిగ్నల్‌కు కూడా నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ
  • వాట్సాప్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన అధికారులు
వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్‌' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు మాతృసంస్థ మెటా స్పందించింది. నిన్న‌ తమ వివరణను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ప్రస్తుతం వాట్సాప్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఫోన్ నంబర్ లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని భావించింది. అయితే, దీనివల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇంపర్సొనేషన్ (autpersonation) దాడులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మెటాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, తమకు సంతృప్తి కలిగే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించవద్దని కఠిన ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో పూర్తి చర్చలు ముగిసే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో తీసుకురాబోమని వాట్సాప్ స్పష్టమైన హామీ ఇచ్చింది. తమ యూజర్ల భద్రత కోసం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ తన వివరణలో పేర్కొంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీల పేర్లను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఇప్పటికే వాటిని రిజర్వ్ చేశామని తెలిపింది. వాట్సాప్ ఖాతాకు ఫోన్ నంబర్ తప్పనిసరని, యూజర్‌నేమ్‌తో ఎవరైనా మొదటిసారి మెసేజ్ పంపినప్పుడు, వారి వివరాలు (కొత్త ఖాతాదారా, కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారా, ఏ దేశం వారు) స్పష్టంగా చూపిస్తామని వివరించింది.

ఈ అంశంపై ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి సమాధానం అందిందని, దానిని పరిశీలిస్తామని తెలిపారు. ఇదే తరహా యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అందిస్తున్న టెలిగ్రామ్, సిగ్నల్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా కేంద్రం నోటీసులు జారీ చేసింది. మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరింది. ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర యాడ్స్‌పై మెటాకు, పైరసీ కంటెంట్ వ్యాప్తిపై టెలిగ్రామ్‌కు కూడా ప్రభుత్వం ఇటీవలే వేర్వేరు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
Advertisement
WhatsApp
Meta
IT Ministry India
WhatsApp Username feature
Cybersecurity India
Online fraud prevention

More Telugu News