రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి!

  • రాజస్థాన్‌లో ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
  • ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • నెలలు నిండకుండా పుట్టడంతో ఎన్‌ఐసీయూలో చికిత్స
  • తక్కువ బరువు, శ్వాస సమస్యలతో శిశువుల పరిస్థితి విషమం
  • తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ మహిళ ఒకే ప్రసవంలో నలుగురు శిశువులకు జన్మనించ్చారు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. శిశువులు నెలలు నిండకుండానే జన్మించడం, బరువు కూడా తక్కువగా ఉండటంతో వారిని ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ఝలావర్ నగరంలోని భోయ్ మొహల్లా నివాసితులైన జ్యోతి కశ్యప్ (25), అరుణ్ కశ్యప్ దంపతులకు ఇప్పటికే ఒక సంతానం ఉంది. రెండో ప్రసవం కోసం ఆమె స్థానిక ప్రభుత్వ హీరా కున్వర్ బా మహిళా ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం వైద్యులు ఆమెకు సిజేరియన్ నిర్వహించగా నలుగురు శిశువులు జన్మించారు. సుమారు 29 వారాలకే ప్రసవం జరగడంతో శిశువులు కేవలం 1.1 కిలోల నుంచి 1.2 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.

సాధారణంగా పూర్తి నెలలు నిండిన శిశువులు 2.5 కిలోల బరువు ఉంటారని, అయితే ఈ శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో వారికి శ్వాస అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు వెల్లడించారు. తన వృత్తి జీవితంలో ఒకే ప్రసవంలో నలుగురు శిశువులు జన్మించడం చూడటం ఇదే మొదటిసారని డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి 24,000 ప్రసవాల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

ప్రస్తుతం తల్లి జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను గైనకాలజీ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. శిశువుల్లో ఒకరి ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామంపై తండ్రి అరుణ్ కశ్యప్ హర్షం వ్యక్తం చేశారు. "నేను ఒక కుమార్తె పుడుతుందని ఆశించాను, కానీ దేవుడు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడిని ప్రసాదించాడు. దైవ నిర్ణయం ఏదైనా మాకు సంతోషమే" అని ఆయన పేర్కొన్నారు.

Jyoti Kashyap
Rajasthan Quadruplets
Jhalawar Rare Birth
Multiple Births Rajasthan
Heera Kunwar Ba Hospital

More Telugu News