100వ టీ20కి చేరువలో అక్షర్‌ పటేల్‌.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

  • ఊహించని మైలురాయిగా అభివర్ణించిన అక్షర్‌
  • ఈ ఘనత అందరిదంటూ వ్యాఖ్యలు
  • ఇటీవలే టీ20లో 100 వికెట్లు పూర్తి
  • 2021 నుంచి వరుస అవకాశాలు వచ్చినట్లు వెల్లడి
  • గత 2 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం మరపురాని జ్ఞాపకాలన్న అక్షర్‌
భారత్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కెరీర్‌లో మరో అరుదైన ఘట్టం చేరువైంది. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టీ20లో బరిలోకి దిగితే అతను భారత్‌ తరఫున 100వ టీ20 మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ సందర్భంగా తన క్రికెట్‌ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అక్షర్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

టీ20ల్లో అరంగేట్రం చేసినప్పుడు 100 మ్యాచ్‌లు ఆడతానని అసలు ఊహించలేదని అక్షర్‌ చెప్పాడు. ఇంగ్లండ్‌ పర్యటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. ఇదే సిరీస్‌లో రెండో టీ20లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నానని, ఇప్పుడు 100వ మ్యాచ్‌ ఆడబోతుండటం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో వెల్లడించాడు.

ఈ ఘనత తన ఒక్కడిదే కాదని అక్షర్‌ స్పష్టం చేశాడు. తన ప్రయాణంలో సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులందరి పాత్ర ఉందని చెప్పాడు. ఒక ఆటగాడికి భారత్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడటమే గొప్ప విషయమని, అలాంటిది 100 మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం ప్రతి క్రికెటర్‌కు కల నిజమవడమేనని పేర్కొన్నాడు.

2015లో టీ20ల్లో అరంగేట్రం చేసిన అక్షర్‌కు తొలి ఐదారేళ్లలో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ సమయంలో కేవలం 15-16 మ్యాచ్‌లే ఆడానని గుర్తు చేసుకున్నాడు. 2021 నుంచి జట్టులో వరుస అవకాశాలు దక్కాయని, గత రెండు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం తన కెరీర్‌లో మరపురాని జ్ఞాపకాలుగా నిలిచాయని తెలిపాడు.

వ్యక్తిగత మైలురాళ్ల కంటే ఆటలో రోజూ మెరుగుపడటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని అక్షర్‌ అన్నాడు. ఎన్నో తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, అనుభవంతో ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా సులభమైందని చెప్పాడు. కెరీర్ ప్రారంభ దశ నాటి అక్షర్‌కు సలహా ఇవ్వాల్సి వస్తే.. తప్పుల నుంచి ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిదని చెబుతానని పేర్కొన్నాడు.

Axar Patel
India vs England T20
Team India
Axar Patel 100 T20 matches
Indian cricket team
Axar Patel milestone

More Telugu News