ఖమేనీ నివాసంపై దాడి.. తొలిసారి వీడియో విడుదల

Ali Khamenei residence destruction footage surfaces after US Israel strikes
  • ఫిబ్రవరి 28న ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌-అమెరికా దాడి
  • దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యుల మృతి
  • ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా 35 సెకన్ల వీడియో విడుదల చేసిన ఇరాన్‌
  • నివాసం తీవ్రంగా ధ్వంసనమైనట్లు వీడియోలో దృశ్యాలు
ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాస సముదాయంపై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తొలిసారిగా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా విడుదలైన 35 సెకన్ల వీడియోలో టెహ్రాన్‌లోని ఆయన నివాస సముదాయంలోని ‘ఇమామ్ ఖమేనీ హుసైనియా హాల్‌’ తీవ్రంగా ధ్వంసమైన దృశ్యాలు కనిపించాయి. పైకప్పు కూలిపోవడం, ఇనుప బీమ్‌లు వంకర తిరగడం, శిథిలాలు పేరుకుపోవడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇదే హాల్‌లో ఖమేనీ కీలక సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేసేవారని నివేదికలు పేర్కొన్నాయి.

ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో 86 ఏళ్ల అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. కుమారుడు మొజ్తబా అలీ ఖమేనీ గాయపడినట్లు ఇరాన్‌ తెలిపింది. ఖమేనీ భౌతికకాయాన్ని టెహ్రాన్‌, కోమ్‌, ఇరాక్‌లోని నజఫ్‌, కర్బలా నగరాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఆయన స్వస్థలం మషద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. దీనికి ప్రతిగా బహ్రెయిన్‌, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ పరిణామాలతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు మిన్నంటాయి.
Advertisement
Ayatollah Ali Khamenei
US Israel airstrikes Iran
Tehran residence attack video
Mojtaba Khamenei injury
Iran US tensions
West Asia war crisis

More Telugu News