ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!

Rajesh Sharma bitten by toxic insect on Prabhas Fauji sets condition critical complaint to Revanth Reddy
  • ప్రభాస్ సినిమా షూటింగ్‌లో  రాజేష్ శర్మకు కీటకం కాటు
  • తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • కోల్‌కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక
  • పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు
  • షూటింగ్ సెట్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై సినీ కార్మిక సంఘం ఆగ్రహం
  • లొకేషన్‌లో రక్షణ ప్రమాణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డికి వినతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఫౌజీ' షూటింగ్ సెట్‌లో కలకలం రేగింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ శర్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. షూటింగ్ ముగిసిన తర్వాత దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో స్థానిక సాంకేతిక నిపుణులతో ఆయన మాట్లాడుతుండగా ఒక విషకీటకం లేదా విషపు సాలీడు ఆయన కాలిపై కుట్టింది. 

మొదట దాన్ని సాధారణమైనదిగా భావించినప్పటికీ, ఆరు గంటల తర్వాత కుట్టిన చోట తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, కాలి వేలి నుండి మోకాలి వరకు పెద్ద బొబ్బలు వచ్చాయి. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన విమానంలో కోల్‌కతా చేరుకుని అక్కడ ధాకురియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని నటి సుదీప ఛటర్జీ తెలిపారు.

ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఐసీడబ్ల్యూఏ) తీవ్రంగా స్పందించింది. లొకేషన్‌లో నటుడికి ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఎందుకు చేర్చలేదని, అసలు షూటింగ్ సెట్‌లో అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని ప్రశ్నించింది. ఈ ఘటనపై తక్షణమే ఒక నిష్పక్షపాత, పారదర్శకమైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసోసియేషన్ డిమాండ్ చేసింది. పని ప్రదేశంలో భద్రత, పరిశుభ్రత, అత్యవసర వైద్య ప్రొటోకాల్స్‌ను పాటించడంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరపాలని కోరింది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు షూటింగ్ లొకేషన్లలో కనీస పరిశుభ్రత, రక్షణ ప్రమాణాలు లేకపోవడంపై తాము గతంలోనూ ఆందోళన వ్యక్తం చేశామని అసోసియేషన్ గుర్తుచేసింది. సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రతి కళాకారుడు, టెక్నీషియన్ ప్రాణం చాలా విలువైనదని.. ఒకవేళ ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యమైనా ఉందని తేలితే ప్రొడక్షన్ హౌస్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే రాజేష్ శర్మ వైద్య ఖర్చులన్నింటినీ నిర్మాతలే భరించాలని స్పష్టం చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి అయిన రాజేష్ శర్మ.. ది డర్టీ పిక్చర్, స్పెషల్ 26, పికు, ఎమ్మెస్ ధోని వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
Rajesh Sharma
Prabhas Fauji
Ramoji Film City
Insect Bite
AICWA
Revanth Reddy

More Telugu News