విశాఖలో ‘బే సిటీ’.. అమరావతి, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీలు: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

Vizag Bay City and Sports Cities in Amaravati Tirupati Chandrababu Naidu directs officials
  • విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై సమీక్ష 
  • ఏపీ సమగ్రాభివృద్ధికి త్రైపాక్షిక వ్యూహం
  • విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
  • 6 నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆదేశం
  • మూడు రీజియన్లలో ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పోర్ట్స్ సిటీల ఏర్పాటు
  • 51.88 చ.కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధికి కార్యాచరణ
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా ఏర్పాటు చేసిన మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఉద్యాన పంటలతో కడప జిల్లా లింగాల మండలం సాధించిన అద్భుత ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని, మొత్తం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతాలను తలదన్నేలా, లింగాల మండలంలో ప్రజల తలసరి ఆదాయం రూ. 7.30 లక్షలుగా ఉండటం ఉద్యాన పంటల సత్తాకు నిదర్శనమని సీఎం అన్నారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ (టీఈఆర్) అభివృద్ధికి హార్టికల్చర్ ఒక గ్రోత్ ఇంజిన్‌గా పనిచేస్తుందని, ఈ ప్రాంతంలో 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలని ఆదేశించారు.

ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్‌లు

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ఇప్పటికే ఆవిష్కరించగా, రాబోయే ఆరు నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్లకు కూడా మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ముసాయిదా ప్రణాళికలను ప్రజలు, ప్రజాప్రతినిధుల ముందు ఉంచి, వారి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుదిరూపు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా, ప్రతి జిల్లాకు రెండు నెలల్లోగా ‘డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్’ రూపొందించాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఉన్న వనరులు, అవకాశాలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు.

‘వైజాగ్ బే సిటీ’.. పర్యాటక సర్క్యూట్‌లు

విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్, గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే మూడు మూలస్తంభాలపై ఈ నగరాన్ని నిర్మించాలని సూచించారు. ఇక్కడ 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. 

రాబోయే మూడు నెలల్లో విశాఖలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. అరకు-పాడేరు-విశాఖను ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని, సూర్యలంక బీచ్‌కు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

అమరావతి, తిరుపతి రీజియన్ల అభివృద్ధి

రాష్ట్ర జనాభాలో 32 శాతం, భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉన్న అమరావతి ఎకనామిక్ రీజియన్ (ఏఈఆర్) అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 9 జిల్లాల పరిధిలోని ఈ రీజియన్‌లో ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులతో పాటు కొల్లేరు సరస్సును అభివృద్ధికి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మరోవైపు, విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీపడేలా తిరుపతి ఎకనామిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

ఖనిజ సంపద, పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలతో టీఈఆర్‌కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. శ్రీసిటీ, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఈ ప్రాంతం స్వర్గధామం కావాలన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో టీఈఆర్ వాటాను 0.90 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రీజియన్ల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మూడు రీజియన్ల ప్రత్యేక అధికారులు ముఖేష్ కుమార్ మీనా, సురేశ్ కుమార్, యువరాజ్ పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Vizag Bay City
Amaravati Sports City
Tirupati Economic Region
Swarnandhra 2047
Andhra Pradesh Economic Development

More Telugu News