మంత్రి నారా లోకేశ్ కు దక్షిణ కొరియా అధికారిక ఆహ్వానం... పర్యటన షెడ్యూల్ ఇదిగో!

Nara Lokesh receives official invitation from South Korea here is the tour schedule
  • జూలై 5 నుంచి 11 వరకు కొరియాలో పర్యటన
  • ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా
  • ఎల్జీ, హ్యోసంగ్ వంటి దిగ్గజ సంస్థలతో కీలక సమావేశాలు
  • సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం కొరియాలో ప్రత్యేక రోడ్ షో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో తమ దేశంలో పర్యటించాలని రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) ప్రభుత్వం ఆయన్ను అధికారికంగా ఆహ్వానించింది. ఈ మేరకు ఆయన జూలై 5 నుంచి 11వ తేదీ వరకు కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్.. కొరియాలోని పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని చెన్నైలోని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్, మంత్రి లోకేశ్ కు పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. భారత్-కొరియా మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేయడంలో ఈ పర్యటన ఒక కీలక ముందడుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లోకేశ్ పర్యటన షెడ్యూల్

జులై 5న సియోల్‌లో ఇండియా డయాస్పోరా ఏర్పాటు చేసే ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, ముఖ్యంగా తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

జులై 6వ తేదీన దక్షిణ కొరియాకు చెందిన టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. అనంతరం, హ్యోసంగ్ భారీ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమవుతారు.

జులై 7న ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ టవర్స్‌లో కీలక సమావేశం జరగనుంది. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్ జు కోహ్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. ఈ భేటీకి ఎల్జీ అనుబంధ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాలు కూడా హాజరుకానున్నాయి. 

జులై 8వ తేదీన కొరియన్ మెరైన్ అక్విప్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది.

జులై 9న కొరియన్ పొలిటికల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్స్ విభాగాల డిప్యూటీ మంత్రులతో వేర్వేరుగా భేటీ అవుతారు.

జులై 10వ తేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడుల గురించి చర్చించడంతో పాటు, కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. 

అదే రోజు రాత్రి, విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించే ప్రత్యేక రోడ్ షోలో పాల్గొంటారు. 11వ తేదీన దక్షిణ కొరియా నుంచి తిరిగి రానున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Nara Lokesh
South Korea Visit
Andhra Pradesh Investment
IT Minister Nara Lokesh
South Korea Tour Schedule
Seoul Investment Meetings

More Telugu News