లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. పెళ్లింట నలుగురు దుర్మరణం!

Prakasam Road Accident Four family members killed in tragic lorry collision
  • అమరావతి-అనంతపురం హైవేపై ఘటన
  • ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ 
  • మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి 
  • పెళ్లికూతురు సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలు 
లారీ రూపంలో వచ్చిన మృత్యువు పెళ్లింట్లో విషాదం నింపింది. ప్రకాశం జిల్లా కంభం పరిధిలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1:15 గంటలకు) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌కు చెందిన కొందరు బంధువులు పెళ్లి వేడుకల కోసం కంభం వచ్చారు. రాత్రి సమయంలో వారంతా కలిసి సమీపంలోని వినాయక స్వామి గుడిని దర్శించుకోవడానికి ఒక ఆటో రిక్షాలో వెళ్లారు. గుడి వద్దకు చేరుకున్నాక కొందరు ఆటో దిగగా.. మరికొందరు ఆటోలోనే కూర్చుని ఉన్నారు. అదే సమయంలో మదనపల్లె నుండి తెలంగాణలోని వైరాకు కొబ్బరి పీచు ఎరువు లోడుతో అత్యంత వేగంగా వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన అంకాలు (22), అతని భార్య అలకనంద (18)లతో పాటు నాగేశ్ (18) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి నాగాలక్ష్మి (4)ని వెంటనే కంభం ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. వివాహమైన కొద్దిరోజులకే భార్యాభర్తలిద్దరూ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

ఈ ప్రమాదంలో పెళ్లికూతురు వీరక్కతో పాటు మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సంజీవరాయుడు, వీరయ్య, ఓలమ్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కంభం సీఐ మల్లికార్జున్, ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Prakasam Road Accident
Cumbum
Giddalur
Andhra Pradesh News
Lorry Auto Collision
Amaravati Anantapur National Highway

More Telugu News