నేను చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది: సీఎం చంద్రబాబు
- ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై తిరుపతిలో వర్క్ షాప్
- ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం అని చంద్రబాబు స్పష్టీకరణ
- అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటన
- ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సలహాదారులు
- నిరంతరం పనిచేయాలి, సంతృప్తి చెందితే అక్కడే ఆగిపోతామన్న సీఎం
స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ‘ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్’ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పేదల జీవితాల్లో మార్పు కోసమే పాలన
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జీఎస్‌డీపీ, సీఏజీఆర్ వంటి ఆర్థిక సూచికలను విశ్లేషిస్తూనే, వాటి ఫలాలు ప్రజల జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తున్నాయో చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇటీవలే గూడూరులో తాను పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మ కుటుంబాల స్థితిగతులను ఉదాహరణగా చూపుతూ, ప్రభుత్వ పథకాలు వారి జీవితాల్లో తెచ్చిన మార్పును సవివరంగా తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటున్నాయో వివరించారు.
దార్శనికతతో ముందుకు..
దేశంలోనే తొలిసారిగా విజన్-2020 రూపొందించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని, కానీ భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి పనిచేశామని గుర్తు చేశారు. ఐటీ విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి, సేవల రంగంలో అపార అవకాశాలు సృష్టిస్తుందని అప్పుడే విశ్వసించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా దేశానికి ఒక విజన్ డాక్యుమెంట్ అవసరమని బలంగా నమ్మారని చెప్పారు. ప్రస్తుత యుగంలో డేటానే అసలైన సంపద అని, భవిష్యత్ మొత్తం డేటా ఆధారిత నిర్ణయాలపైనే నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.
టెక్నాలజీతో పారదర్శక పాలన
ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంతో పాటు, రాష్ట్రంలో సంపద సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతే కీలకమని చంద్రబాబు అన్నారు. అందుకే స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటి సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ‘డేటా లేక్’ రూపొందిస్తున్నామని, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు హెల్త్ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసే ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు.
పేద, ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు, సమాజం ద్వారా ఎదిగిన వారు తిరిగి సమాజానికి సేవ చేసేలా ప్రోత్సహించేందుకు ‘పీ4’ (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
అమరావతిలో క్వాంటం కంప్యూటర్
అనంతరం సభికులతో జరిగిన ముఖాముఖిలో సీఎం మాట్లాడుతూ.. తాను త్వరగా సంతృప్తి చెందే వ్యక్తిని కాదని, సంతృప్తి చెందితే అక్కడితో ఆగిపోతామని అన్నారు. ప్రజల కోసం నిరంతరం కొత్త విధానాలు, సాంకేతికతను అన్వేషిస్తూనే ఉండాలని సూచించారు. "దేశం నాకేమిచ్చిందని కాకుండా, దేశానికి మనమేం చేశామని ఆలోచించాలి" అని యువతకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేస్తూ, త్వరలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ విధానాలపై నిపుణుల ప్రశంసలు
ఈ వర్క్‌షాప్‌లో భాగంగా జరిగిన ప్యానెల్ చర్చను ముఖ్యమంత్రి సభికుల మధ్య కూర్చొని ఆసక్తిగా తిలకించారు. ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర స్టాటస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం, ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ తదితరులు ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు.
నియోజకవర్గాల వారీ విజన్ ప్లాన్, పీ4 కార్యక్రమం, గ్రామస్థాయిలో డేటా సేకరణ వంటివి దేశంలోనే వినూత్నమైనవని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.