అన్నాడీఎంకేకు భారీ షాక్.. టీవీకేలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు
- 15,000 మంది అనుచరులతో పార్టీలో చేరిన సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్
- అన్నాడీఎంకే నాయకత్వంపై అసంతృప్తితోనే ఈ నిర్ణయమని ప్రకటన
- ఇది ట్రైలర్ మాత్రమేనని, మరిన్ని చేరికలు ఉంటాయని విజయభాస్కర్ వ్యాఖ్య
- పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు కూడా టీవీకేలో చేరిక
చెన్నై సమీపంలోని మామల్లపురంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో గురువారం ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మంత్రి ఆధవ్ అర్జున కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అన్నాడీఎంకే నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితోనే తాము పార్టీ మారుతున్నట్లు మాజీ మంత్రులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సి. విజయభాస్కర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మరియు తర్వాత కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తాము పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా డీఎంకేతో పొత్తుకు ప్రయత్నిస్తుండటంతో తాము పార్టీలో ఇమడలేకపోయామని తెలిపారు. ప్రజల్లో అపారమైన విశ్వాసం నింపిన విజయ్ నాయకత్వంలోని టీవీకేలో చేరడమే సముచితమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన అతిపెద్ద చేరికల్లో ఇది ఒకటి. ఈ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మరో మాజీ మంత్రి ఎస్. వలర్మతి, ఎం.ఎస్.ఎం. ఆనందన్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, 208 మంది యూనియన్ కార్యదర్శులు కూడా టీవీకేలో చేరారు. కరూర్, పుదుక్కోట్టై జిల్లాల నుంచి సుమారు 200 బస్సులు, 600 కార్లలో భారీ సంఖ్యలో మద్దతుదారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ చేరికలు కేవలం 'ట్రైలర్' మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో టీవీకే వంద శాతం విజయం సాధిస్తుందని విజయభాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.