ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి సిగ్గుచేటు కాదు.. కానీ తీవ్రంగా నిరాశపరిచింది: శ్రేయస్ అయ్యర్
- బెల్‌ఫాస్ట్ మైదానం పరిస్థితులకు అలవాటుపడటంలో విఫలమయ్యామన్న శ్రేయస్
- అన్ని విభాగాల్లోనూ ఐర్లాండ్ జట్టు తమను అధిగమించిందని ప్రశంస
- ఆ సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకున్నామన్న టీమిండియా కెప్టెన్
- ఇంగ్లండ్ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ
- వ్యక్తిగత ఫామ్‌పై ఆందోళన లేదని, ఒత్తిడిలో ఎలా ఆడాలో తనకు తెలుసని ధీమా
ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. "వారు మమ్మల్ని అన్ని విభాగాల్లోనూ అధిగమించారు. మైదానం కొలతలపై వారికి అద్భుతమైన అవగాహన ఉంది. కానీ మేం మైదానాన్ని, వికెట్ తీరును విశ్లేషించడంలో, ప్రణాళికలు రచించడంలో వెనుకబడ్డాం. క్రెడిట్ వాళ్లకే దక్కుతుంది. అయితే, ఆ సిరీస్ నుంచి మేం చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఇంగ్లండ్ పర్యటన మాకు ఒక కొత్త అధ్యాయం" అని అయ్యర్ వివరించాడు.
బెల్‌ఫాస్ట్‌లోని స్టార్‌మాంట్ మైదానం పరిస్థితులకు అలవాటు పడటంలో జట్టు విఫలమైందని అయ్యర్ తెలిపాడు. "బెల్‌ఫాస్ట్‌లో చాలా ఏళ్ల తర్వాత ఆడాం. అక్కడి పరిస్థితులకు, వికెట్‌కు అలవాటు పడటంలో మేం కొంచెం వెనుకబడ్డాం. ఆ మైదానం ఒక స్టేడియంలా లేదు. అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా, అసమానంగా ఉంది. మైదానం కొలతలు కూడా చతురస్రాకారంలో వింతగా ఉన్నాయి. కెప్టెన్‌గా ఫీల్డింగ్ సెట్ చేయడం కూడా నాకు సవాలుగా అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్‌లో మేం ఆడిన గ్రౌండ్‌లన్నీ అన్ని వైపులా సమానంగా ఉంటాయి" అని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌లోని పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఇక్కడి మైదానాలు చదునుగా, స్టేడియం వాతావరణంతో ఉంటాయని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ తన వ్యక్తిగత ఫామ్‌పై ఆందోళన లేదని స్పష్టం చేశాడు. "నెట్స్‌లో నేను బంతిని అద్భుతంగా టైమ్ చేస్తున్నాను. ఒత్తిడిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. నా నైపుణ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది" అని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.