"కేవలం రెండు నిమిషాలే"... కదులుతున్న కారులో యువతికి లైంగిక వేధింపులు!
- ఢిల్లీలో 24 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులు
- మోమోస్ తిందామనే నెపంతో బయటకు కారులతో తీసుకెళ్లిన నిందితుడు
- వేధింపుల ఘటనను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన బాధితురాలు
- నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్ఐఆర్ నమోదు
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వివరాల్లోకి వెళితే, తూర్పు ఢిల్లీలోని మండవాలి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మోమోస్ తిందామని చెప్పి ఆమెను కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో సీఎన్జీ నింపుకున్న తర్వాత, కారును నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు. అక్కడ కారులో ఉండగానే అసభ్యకరంగా మాట్లాడటం, లైంగిక వాంఛ తీర్చమని డిమాండ్ చేయడం, అసభ్యంగా తాకడం వంటివి చేశాడు.
ఆమె కారు నుంచి దిగిపోవడానికి ప్రయత్నించగా నిందితుడు అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు తనను వదిలిపెట్టమని వేడుకోవడం, కారులోంచి దూకేస్తానని హెచ్చరించడం వంటివి వీడియోలో రికార్డయ్యాయి. "నా కోరిక తీర్చు... కేవలం రెండు నిమిషాలే..!" అంటూ నిందితుడు చెప్పిన మాటలు కూడా వీడియోలో స్పష్టంగా ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మండవాలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆపద సమయంలో యువతి చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.