రెండేళ్ల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం: టీజీ భరత్
- ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల విలువ రూ. 11.77 లక్షల కోట్లుగా ఉందన్న భరత్
- ఈ ప్రాజక్టుల వల్ల దాదాపు 10.32 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి
- యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత రెండేళ్ల కాలంలోనే రాష్ట్రం సుమారు రూ.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమైందని, ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన ప్రాజెక్టుల విలువ రూ.11.77 లక్షల కోట్లుగా ఉందన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 10.32 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం పెట్టుబడుల్లో ఏపీ వాటా 24.3 శాతానికి చేరుకుందని, పారిశ్రామిక అనుమతులను వేగంగా ఇస్తూ రాష్ట్రం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మంత్రి వివరించారు.
రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, స్పేస్ అండ్ డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్లు వంటి అత్యాధునిక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం 'ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త' అనే వినూత్న విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి చెప్పారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలోని సరికొత్త ఆలోచనలను, ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శ్రీహరికోటను కేంద్రంగా చేసుకుని స్పేస్ సిటీతో పాటు స్పేస్ టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 'భవ్య' పార్కుల్లో కనీసం 3 నుంచి 4 పార్కులను ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని... ఎయిర్‌స్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని వెల్లడించారు.