నాలుగుసార్లు ఛాంపియన్‌కు చుక్కలు.. జర్మనీని చిత్తు చేసిన పరాగ్వే
- ఫిఫా వరల్డ్ కప్‌లో పెను సంచలనం
- నాలుగుసార్లు ఛాంపియన్ జర్మనీ ఇంటికి
- పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో పరాగ్వే చారిత్రక విజయం
- తమది మట్టి కాళ్ల ఆటన్న పరాగ్వే కోచ్
- రెండు పెనాల్టీలు ఆపి హీరోగా నిలిచిన గోల్ కీపర్
ఈ చారిత్రక విజయం అనంతరం పరాగ్వే హెడ్ కోచ్ గుస్తావో అల్ఫారో భావోద్వేగంతో స్పందించాడు. తన ఆటగాళ్లను యోధులుగా అభివర్ణించాడు. "మ్యాచ్‌కు ముందు నా దగ్గర 26 మంది యోధులు ఉన్నారు. కానీ, మ్యాచ్ తర్వాత వాళ్లు లెజెండ్స్‌గా మారిపోయారు. బహుశా మేము తర్వాతి రౌండ్‌లో ఓడిపోవచ్చు, లేదా గెలవొచ్చు. కానీ, ఈ మ్యాచ్ మాత్రం ఒక చారిత్రక ఘట్టం" అని అన్నాడు. తమ ఆటగాళ్ల నేపథ్యాన్ని, జర్మనీ ఆటగాళ్ల నేపథ్యాన్ని పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
"మా ప్రత్యర్థులు యూరప్‌లోని అత్యుత్తమ అకాడమీల్లో శిక్షణ పొందారు. కానీ, మేము ఎర్రమట్టి నేలల నుంచి వచ్చాం. మా తల్లిదండ్రులు చేసిన త్యాగాల వల్ల, బూట్లు లేకుండా ఫుట్‌బాల్ ఆడుతూ కలలను సాకారం చేసుకోవడం నేర్చుకున్నాం. ఇది మా మూలాల బలం" అని వివరించాడు.
ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచిన పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్, షూటౌట్‌లో రెండు కీలక పెనాల్టీలను అడ్డుకుని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. తన ప్రదర్శన వెనుక కఠోర శ్రమ ఉందని తెలిపాడు. "ప్రతి ఆటగాడిని, ప్రతి అంశాన్ని, ప్రతి చిన్న విషయాన్ని నేను విశ్లేషించాను. దాని ఫలితంగానే రెండు పెనాల్టీలను ఆపగలిగాను. అవే మా గెలుపును నిర్ధారించాయి" అని 26 ఏళ్ల గిల్ చెప్పాడు. మ్యాచ్ మొత్తంలో జర్మనీ తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని, "అదొక హారర్ సినిమా చూసినట్లుంది. జర్మన్ ఆటగాళ్లు మైదానంలో ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నారు" అని వ్యాఖ్యానించాడు.
జట్టు తరఫున గోల్ చేసిన జూలియో ఎన్సిసో మాట్లాడుతూ.. జర్మనీ గొప్ప జట్టు అయినప్పటికీ తాము భయపడలేదని స్పష్టం చేశాడు. "వారికి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి గౌరవించాం. కానీ, ఎవరికీ భయపడలేదు" అని ధీమా వ్యక్తం చేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం కోసం ఫ్రాన్స్, స్వీడన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో పరాగ్వే తలపడనుంది. "తర్వాతి ప్రత్యర్థి ఎవరైనా, వారి ఆటగాళ్లు స్టార్స్ అయినా, మాకంటూ సొంత బలాలు, శైలి ఉన్నాయి. వాటితోనే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం" అని ఎన్సిసో పేర్కొన్నాడు.