ఏడుపు ఆపేందుకు ఫోన్ ఇస్తున్నారా? ప్రమాదంలో మీ పిల్లల భవిష్యత్..!
- మాట్లాడే సామర్థ్యం ఆలస్యమయ్యే అవకాశం
- నిద్రపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అధ్యయనం
- ఆటలు, శారీరక చలనం తగ్గే ప్రమాదం
- భావోద్వేగ వికాసంపై ప్రభావం
- కంటి ఆరోగ్యం, ఊబకాయం ప్రమాదంపై హెచ్చరిక
బ్రిటన్‌కు చెందిన నాలుగు విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటివరకు ఈ అంశంపై వెలువడిన పరిశోధనల్లో ఇదే అత్యంత విస్తృతమైన సమీక్షగా పరిశోధకులు పేర్కొన్నారు. స్క్రీన్ వల్లే సమస్యలు వస్తాయని కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసినా, అందుబాటులో ఉన్న ఆధారాలు మాత్రం తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని తెలిపారు.
పరిశోధన ప్రకారం రెండేళ్లలోపు పిల్లలకు తరచూ మొబైల్, ట్యాబ్లెట్, టీవీ వంటి డిజిటల్ స్క్రీన్‌లు చూపిస్తే మాట్లాడే సామర్థ్యం ఆలస్యంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిద్ర నాణ్యత దెబ్బతినొచ్చు. బయట ఆడుకునే సమయం తగ్గిపోవచ్చు. కంటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది. చిన్న వయసులోనే ఊబకాయం వచ్చే అవకాశాలు పెరగొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మరో కీలక అంశాన్ని కూడా ఈ అధ్యయనం ప్రస్తావించింది. చిన్నారులు అసౌకర్యంగా అనిపించినప్పుడు తల్లిదండ్రుల వద్ద ఓదార్పు పొందడానికి బదులు డిజిటల్ పరికరాలపైనే ఆధారపడే అలవాటు పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల భావోద్వేగ వికాసంపై కూడా ప్రభావం పడొచ్చని హెచ్చరించింది.
రెండేళ్లలోపు పిల్లలకు ఉద్దేశపూర్వకంగా స్క్రీన్ చూపించడం వల్ల ఎలాంటి స్పష్టమైన ప్రయోజనం కనిపించలేదని పరిశోధకులు తేల్చారు. ఈ వయసులో ప్రత్యక్ష సంభాషణ, ఆటలు, తల్లిదండ్రులతో గడిపే సమయమే మెదడు ఎదుగుదలకు కీలకమని గుర్తు చేశారు.
చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులే మెదడు అభివృద్ధికి అత్యంత కీలక దశ అని పేర్కొన్న పరిశోధకులు, తల్లిదండ్రులను తప్పుబట్టడం కంటే వారికి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల స్క్రీన్ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని ప్రభుత్వాలకు సూచించారు.