41 మంది ప్రాణాలు పోయిన ఘటన.. బాధితులను పరామర్శించనున్న సీఎం విజయ్
- జులై 10, 11న కరూర్‌లో సీఎం విజయ్ పర్యటన
- తొక్కిసలాట మృతుల కుటుంబాలతో భేటీ
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చే యత్నం
- జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- కరూర్తో మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన
గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై జన సమూహాన్ని నియంత్రించలేకపోవడం, భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఘటన జరిగిన వెంటనే కరూర్‌కు వెళ్లాలని విజయ్ భావించినా భద్రతా కారణాలతో అది సాధ్యం కాలేదు. అప్పట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి సంతాపం తెలిపారు. తర్వాత వారందరినీ మామల్లపురానికి ఆహ్వానించి వ్యక్తిగతంగా కలిశారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. కుటుంబాల అవసరాలను పరిశీలించి అవసరమైతే మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు కరూర్ పర్యటనలో మరోసారి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు. ప్రభుత్వం వారి వెంటే ఉందనే సందేశాన్ని మరోసారి స్పష్టంగా తెలియజేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల పర్యటనలో జిల్లాలో పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు విజయ్ శ్రీకారం చుట్టనున్నారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కరూర్ పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలకు విజయ్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలును స్వయంగా సమీక్షించేందుకు ఇతర జిల్లాల్లోనూ పర్యటించనున్నారని తెలుస్తోంది.